`మన్మథుడు 2` తరవాత... నాగార్జున నుంచి మరో సినిమా రాలేదు. `వైల్డ్ డాగ్`ని పూర్తి చేసినా.. ఆ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నెట్ ఫ్లిక్స్ లో నేరుగా ఈ సినిమా విడుదల చేస్తారని కొందరు అంటుంటే, థియేటర్ రిలీజ్ తో పాటు... ఓటీటీలోనూ కేసారి ఈ సినిమా రాబోతోందని ఇంకొంతమంది చెబుతున్నారు.
అయితే వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన నాగ్.. ఇప్పుడు మరుసటి సినిమా పనుల్లో పడిపోయాడని తెలుస్తోంది. నాగ్ కోసం ప్రస్తుతం రెండు కథలు సిద్ధం అవుతున్నాయి. ఒకటి బంగార్రాజు అయితే మరోటి ప్రవీణ్ సత్తారు కథ. ప్రవీణ్ సత్తారు ఇటీవల నాగ్ కి ఓ మంచి యాక్షన్ థ్రిల్లర్ కథని చెప్పగా, ఆ కథని నాగ్ ఓకే చేసేశాడు. బంగార్రాజు కంటే ముందు ఈ సినిమానే మొదలవుతుంది. ఇప్పుడు హీరోయిన్ నీ పట్టేశారట. ఎంతవాడుగాని చిత్రంతో ఆకట్టుకున్న అనిఖా సురేంద్రన్ ని ఈ సినిమాతో కథానాయికగా పరిచయం చేస్తున్నారని టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.