అల్లరి నరేష్ అంటే కామెడీ కథలకు కేరాఫ్ అడ్రస్స్. తన సినిమాలు, అందులోని తన పాత్రలు అన్నీ సరదాగా ఉంటాయి. నరేష్ ఓ సీరియస్ ఇష్యూని తీసుకుని సినిమా తీస్తే ఎలా ఉంటుంది? ఓ సీరియస్ ఎమోషన్‌ని పండిస్తే ఎలా ఉంటుంది? ఓ సమస్యని చూపిస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం `నాంది`లో దొరుకుతుంది. శ్రీచరణ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈరోజు నరేష్ పుట్టిన రోజు.
ఈ సందర్భంగా `నాంది` టీజర్ ని విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ వాయిస్ ఓవర్‌తో సాగిందీ టీజర్. న్యాయ వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపే కథాంశం.. నాంది. అసలు ఈ కథ ద్వారా ఏం చెప్పబోతున్నారు? ఏం చూపించబోతున్నారు? అనేది టీజర్‌లోని విజువల్స్ తో, డైలాగులతో చెప్పేశారు. ఈ దేశంలో ఎలాంటి నేరం చేయకుండా.. శిక్ష అనుభవిస్తున్న ఖైదీల గురించిన కథ ఇది. మనిషి పుట్టడానికి కూడా తొమ్మిది నెలలే పడుతుంది. కానీ న్యాయం దొరకడానికి ఇంత కాలం ఎందుకు? అని ఓ నిరపరాధి అడిగే ప్రశ్న చుట్టూనే `నాంది` కథేంటో తెలిసిపోతుంది.
చాలా సీరియస్ ఎమోషన్‌తో సాగింది టీజర్. నరేష్‌ని కొత్తగా చూస్తారు. తన విశ్వరూపం టీజర్‌లోనే కనిపించింది. నగ్నంగా నరేష్ కనిపించే దృశ్యాలు షాక్ కి గురి చేస్తాయి. ఈ దేశంలోని పోలీసులు , న్యాయ వ్యవస్థ పని చేసే పనితీరుని ప్రశ్నించేలా ఉండబోతోందని అర్థమైంది. మొత్తానికి టీజర్ తోనే వైబ్రేషన్స్ వచ్చేసినట్టు అయ్యింది. ఇక పూర్తి సినిమా ఎలా వుంటుందో?