టాప్ హీరోలను ఎవరిని తీసుకున్నా వారు ఇప్పుడు నటిస్తున్న సినిమా కాకుండా నెక్స్ట్ నటించబోయే రెండు సినిమాలు కూడా ఫిక్స్ అయ్యాయి. కొందరైతే కనీసం ఇప్పుడు చేస్తున్న సినిమా కాకుండా ఒక్క సినిమాను అయినా లైన్లో పెట్టారు. కానీ రామ్ చరణ్ మాత్రం ప్రస్తుతం నటిస్తున్న 'RRR' తర్వాత నటించబోయే సినిమాలను ఫైనలైజ్ చేసుకోలేదు. అయితే తాజాగా చరణ్ కూడా నెక్స్ట్ సినిమాలను సెట్ చేసుకునే పనిలో పడ్డారట. చరణ్ 'RRR' తర్వాత మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'ఆచార్య' లో ఒక కీలక పాత్రలో నటించబోతున్నారని తెలిసిందే.
ఈ సినిమా తర్వాత చేసే సినిమాల లిస్టులో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఒకటి ఉండేలా చర్చలు జరుపుతున్నారట. ఈ సినిమా #NTR30 తర్వాతే పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇక త్రివిక్రమ్ సినిమా తో పాటుగా పలువురు యువ దర్శకులను తనకు సూటయ్యేలా మంచి స్క్రిప్టులను తీసుకురావాల్సిందిగా కోరారట. 'RRR' షూటింగ్ పూర్తయ్యేలోపు డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే పూర్తి స్థాయి స్క్రిప్ట్ తయారు చేసేందుకు వారికి సమయం ఉంటుందని చరణ్ భావిస్తున్నారట. ఇది నిజంగానే దర్శకులకు గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 'RRR' సినిమా రిలీజ్ తర్వాత చరణ్ చేసే సినిమాల స్థాయి వేరుగా ఉంటుంది కాబట్టి వారికి భారీ బడ్జెట్లతో సినిమాను తెరకెక్కించే అవకాశం లభిస్తుంది.