హీరో నితిన్ నాలుగైదు ప్రాజెక్టులు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగ్ దే' రిలీజుకు రెడీగా ఉంది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'చెక్' కూడా షూటింగ్ దశలో ఉంది. ఇవి కాకుండా కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' అనే చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు హిందీ సూపర్ హిట్ 'అంధాధున్' రీమేక్ లో కూడా నటించబోతున్నారు.
'అంధాధున్' రీమేక్ కు మేర్లపాక గాంధీ దర్శకుడు. తాజాగా ఈ రీమేక్ కు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్ ను ఎంచుకున్నారట. హిందీలో రాధిక ఆప్టే నటించిన పాత్రలో నభ నటిస్తుందని సమాచారం. 'నన్ను దోచుకుందువటే', 'ఇస్మార్ట్ శంకర్' లాంటి చిత్రాలతో అటు గ్లామర్ పరంగా ఇటు నటన పరంగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సాధించింది నభ. దీంతో ఈ సినిమాలో రాధిక పాత్రకు నభ న్యాయం చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో టబు పాత్ర కోసం పలువురు సీనియర్ హీరోయిన్లను సంప్రదించారని వార్తలు వచ్చాయి కానీ ఇంతవరకు ఎవరూ ఫైనలైజ్ కాలేదు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే ప్రయత్నాలలో ఉన్నారట.