నాగ్ అశ్విన్.. ఎప్పుడూ ప్రశాంతంగా చిద్విలాసం చిందిస్తూ కనిపించే కుర్ర దర్శకుడు. చేసిన రెండు సినిమాలతో తనదైన ముద్ర సృష్టించుకున్న యువతరపు ప్రతినిధి. మైకు ముందు మాట్లాడడానికి మొహమాటపడే అశ్విన్... ఇప్పుడు తన ఆక్రోశం, ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుని ఎండగడుతున్నాడు. నేరుగా కేటీఆర్ కే ట్విట్టర్ వేదికగా సూటిగా ప్రశ్నలు సంధించాడు.
రెండ్రోజుల క్రితం నాగ్ అశ్విన్ స్నేహితుడు, కెమెరా మెన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నిజానికి వైద్యులు సకాలంలో స్పందిస్తే బతికేవాడే. కానీ.. వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తన స్నేహితుడ్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ రోజు ఆదివారం కావడంతో అక్కడ వైద్యులు అందుబాటులో లేరు. సకాలంలో వైద్యం అందక చనిపోయాడు. ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టిని ట్విట్టర్ ద్వారా తీసుకెళ్లారు అశ్విన్.
‘ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత మూడు గంటల పాటు అతను చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు. ఆ రోజు ఆదివారం కావడంతో సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. అతని తల్లిదండ్రులే స్ట్రెచర్‌పై పడుకోబెట్టి మోసుకుంటూ తిరిగారు. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వాస్పత్రిలో వైద్యం అందక ఓ మనిషి చనిపోవడం దారుణం. ఆ సమయంలో మరేదైనా ఆసుపత్రికి తరలించి ఉంటే అతను బతికేవాడే. ప్రభుత్వాస్పత్రి అంటే చావుకు, నిర్లక్ష్యానికి పర్యాయపదం కాదు అని చెప్పడానికి ఏం చేయమంటారో చెప్పండి కేటీఆర్ సర్.
దీని గురించి నాకు ఎవర్ని ప్రశ్నించాలో అర్థంకావడంలేదు సర్. అనవసరంగా అలా వైద్యం అందక ఎవ్వరూ చనిపోకూడదు’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు అశ్విన్. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తన ప్రతీ ట్వీట్‌కీ స్పందిచే కేటీఆర్... ఇప్పుడు నాగ అశ్విన్‌కి ఎలాంటి సమాధానం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.