సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చిరంజీవి, పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యల దుమారం రేపాయి. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవి హాజరవడాన్ని నారాయణ తప్పుబట్టారు. చిరంజీవి ఊసరవెల్లి లాంటివాడని, అల్లూరి విగ్రహావిష్కరణకు సూపర్ స్టార్ కృష్ణను వేదికమీదకు తీసుకొచ్చి ఉంటే బాగుండేదని, ఊసరవెల్లిలా ప్రవర్తించే చిరంజీవిని తీసుకెళ్లడమేంటని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి అతను ఓ ల్యాండ్ మైన్ లాంటివాడని ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలియదని విమర్శించారు.
నారాయణ చేసిన వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్, జనసేన అభిమానులు భగ్గుమన్నారు. తాజాగా నాగబాబు దీనిపై తీవ్రంగా స్పందించారు.
ఇటీవలి కాలంలో మెగా అభిమానులు, మన జనసైనికులు కొంత మంది చేసిన తెలివితక్కువ వెర్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ మన కుర్రాళ్ళకి నేను చెప్పదలుచుకొందేంటంటే... ఈ సిపిఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుండి అన్నం తినడం మానేసి కేవలం ఎండి గడ్డి, చెత్తా చెదారం తింటున్నాడని గుర్తించాలి. కాబట్టి మన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏమిటనగా.. దయచేసి వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి ...కాస్త అన్నం పెట్టండి .. తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు'' అని కౌంటర్ ఇచ్చారు నాగబాబు.