మా ఎన్నికల్లో తన ఓటమికి కారణమైన నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ నటుడు, 'మా' మాజీ అధ్యక్షుడు శివాజీరాజా సవాల్ చేసిన సంగతి తెలిసిందే. అందుకు ప్రతిగా శివాజీరాజా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, మొన్న జరిగిన ఎలక్షన్స్‌లో నాగబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.
ఇదంతా జరిగిపోయిన విషయమే. ఇక తాజాగా నాగబాబు ఈ విషయమై స్పందించారు. 'శివాజీరాజా ఎందుకు ఇలా బిహేవ్ చేశాడో నాకు తెలీదు కానీ, ఆల్రెడీ ఓ సారి మా అధ్యక్షుడిగా పని చేసిన శివాజీరాజా మరోసారి ఆ పదవికి ఆశపడడం హాస్యాస్పదం. శివాజీరాజా కంటే, నరేష్ పెద్ద నటుడు. మాజీ హీరో. ఆయనకీ ఓ సారి అవకాశమివ్వాలనే నరేష్ ప్యానెల్‌కి సపోర్ట్ చేశాను. ఇకపోతే నేను మద్దతివ్వలేదనే కోపంతో నాకు వ్యతిరేకంగా శివాజీరాజా వైసీపీలో చేరాడని కొందరు అంటున్నారు. అయినా నాకు ఆయనపై కోపమేమీ లేదు. కానీ నా సపోర్ట్‌తో గెలిచిన జీవిత - రాజశేఖర్ కూడా వైసీపీలో చేరారు. మరి దీన్నేమంటారు.? హాస్యాస్పదంగా లేదూ.. ఏది ఏమైనా ఈ ఘటన నా జీవితంలో విభిన్న ఘటన.
ఇంతకు మించి దీని గురించి మాట్లాడేందుకు ఏమీ లేదు.. అని నాగబాబు తెలిపారు. జనసేన పార్టీ తరపు నుండి ఎంపీగా నాగబాబు లోక్‌సభకు పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఫలితం ఎలా ఉండబోతోందో త్వరలో తేలనుంది.