నాగచైతన్య - విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్ లో రూపొందించిన చిత్రం `థ్యాంక్యూ`. జులై 8న రావాల్సిన సినిమా ఇది. దీన్ని రెండు వారాలు వాయిదా వేశారు. ఇప్పుడు జులై 22న తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఆయన చాలా ప్లాన్డ్‌గా ఉంటారు. తన సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారంటే.. ఆ సమయానికి సినిమాని విడుదల చేయడం ఖాయం. అయితే... థ్యాంక్యూ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఆయన సినిమాని రెండు వారాల పాటు వెనక్కి జరిపారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫస్ట్ కాపీ కూడా దాదాపుగా రెడీ. అయినా సరే, సినిమాని వాయిదా వేశారు. దానికి కారణమేంటా? అని అంతా ఆరా తీస్తున్నారు.
ఈ సినిమాకి ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయట. నేరుగా ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తే లాభదాయకంగా ఉంటుందని దిల్ రాజు భావిస్తున్నట్టు సమాచారం. అందుకే.. ఓటీటీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారని, అందులో భాగంగానే తన సినిమాని రెండు వారాల పాటు వాయిదా వేశారని తెలుస్తోంది. మరోవైపు.. ఈ సినిమాకి ఇప్పటి వరకూ వచ్చిన బజ్‌పై దిల్ రాజు సంతృప్తిగా లేరని తెలుస్తోంది. టీజర్, రెండు పాటలు విడుదల చేసినా.. రావల్సినంత ప్రచారం రాలేదని, ఈసారి ఇంకాస్త గట్టిగా ప్రమోషన్లు జరిపి, అప్పుడు సినిమాని విడుదల చేయాలని, అలా చేయాలంటే కనీసం మరో రెండు వారాల పాటు గ్యాప్ కావాలని భావిస్తున్నార్ట. అందుకే థ్యాంక్యూ సినిమాని వాయిదా వేశారని సమాచారం.