ప్రేమ కథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించే నాగచైతన్య ప్రస్తుతం 'లవ్ స్టోరి' అనే మరో ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు. మంచి కాఫీ లాంటి చిత్రాలను ప్రేక్షకులు అందించే శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకుడు కాగా 'ఫిదా' బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో నాగచైతన్య డాన్స్ గురించి ఒక ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. నాగచైతన్య మొదటి నుంచి యావరేజ్ డాన్సర్ గానే పేరు తెచ్చుకున్నారు కానీ తన స్టెప్పులతో ఎప్పుడూ ప్రేక్షకులను మాయ చేయలేకపోయారు.
అయితే ఈ సినిమాలో మాత్రం ఒక స్పెషల్ సాంగ్ ఉందని, దాని కోసం చైతు విభిన్నంగా ఉండే స్టెప్పులు ట్రై చేశారని సమాచారం అందుతోంది. ఈసారి మాత్రం చైతూ తన డాన్స్ తో తప్పనిసరిగా ప్రేక్షకులను మెప్పిస్తారని 'లవ్ స్టోరి' టీమ్ మెంబర్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై నారాయణ దాస్ కె. నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.