'రారండోయ్' అంటూ వసూళ్ళ వేడుక చూపించిన అక్కినేని నాగచైతన్య, ఈసారి యుద్ధం చేయబోతున్నాడు. చైతూ యుద్ధం దేనికో తెలియాలంటే, 'యుద్ధం శరణం' సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే. ఈ చిత్రానికి కృష్ణ ఆర్‌వి మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. రజిని కొర్రపాటి, వారాహి బ్యానర్‌లో నిర్మిస్తున్న సినిమా 'యుద్ధం శరణం'. 'పెళ్ళి చూపులు' ఫేం వివేక్ సాగర్ ఈ చిత్రం కోసం అద్భుతమైన సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్ నెగెటివ్ రోల్‌లో నటిస్తున్నాడు చాలాకాలం తర్వాత. ఒకప్పుడు నెగెటివ్ రోల్స్‌తో నటుడిగా పాపులర్ అయిన శ్రీకాంత్, హీరో అయ్యాక మళ్ళీ విలనిజం వైపు చూడలేదు. నాగచైతన్య సినిమా కోసం నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడట. 'యుద్ధం శరణం' అనే టైటిల్ ఆషామాషీగా పెట్టేయలేదట. టైటిల్ వెనుక పెద్ద కథే ఉందంటున్నారు. సినిమాలో నాగచైతన్య పాత్ర తీరుతెన్నులు, చిత్ర కథాంశం అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ టైటిల్‌ని నిర్ణయించామని చిత్ర దర్శక నిర్మాతలు అంటున్నారు. మాస్ టచ్‌తో కూడిన ఇంటలెక్చువల్ తరహా స్క్రీన్‌ప్లేతో సినిమా పరుగులు పెడుతుందట. ఆగస్ట్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జులై 15న టీజర్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాగచైతన్య సరసన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ తరం కుర్రాడు ఎలా ఉంటాడో అలా నాగచైతన్య కనిపిస్తాడట. లుక్, బాడీలాంగ్వేజ్ పరంగా చైతూ ఈ సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట.