చలో సినిమాతో ఫామ్‌లోకి వచ్చినట్టే కనిపించిన నాగశౌర్య ఆ తరవాత వరుసగా రెండు ఫ్లాపుల్నిచవిచూడాల్సివచ్చింది. సొంత బ్యానర్‌లో తీసిన నర్తన శాల అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అశ్వద్ధామతోనూ నష్టాలే మిగిలాయి. ఇప్పుడు ఓ హిట్టు కొట్టి నిరూపించుకోవాల్సిన పరిస్థితి. తన చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. కాబట్టి హీరోగా ఎలాంటి సమస్యా లేదు. కాకపోతే మొహమాటానికి పోయి సినిమాల్ని ఒప్పుకుంటున్నాడని టాక్. దాంతో తన కెరీర్ కూడా నష్టపోతోంది.
ఇటీవల లక్ష్మీ సౌజన్యని దర్శకురాలిగా పరిచయం చేస్తూ ఓ సినిమా మొదలెట్టాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. కొంతమేర షూటింగ్ కూడా జరిగింది. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల ఆగిపోయింది. అయితే ఈ సినిమా ఇక మీదట మళ్లీ పట్టాలెక్కడం కష్టమే అని టాలీవుడ్ టాక్. లక్ష్మీ సౌజన్య ఈ కథని పట్టుకుని చాలామంది హీరోలకు వినిపించింది. ఎవరూ చేయడానికి సాహసించలేదు. కానీ... నాగశౌర్య మొహమాటం కొద్దీ ఈ సినిమా ఒప్పుకున్నాడని, తీరా రషెష్ చూసుకుంటే.. ఈ సినిమాని ఆపేయడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై నిర్మాతలతో నాగశౌర్య మాట్లాడుతున్నాడని, ఈ కథని వేరే దర్శకుడి చేతిలో పెట్టాలా? లేదంటే పూర్తిగా పక్కన పెట్టేయాలా? అనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.