మెగాబ్రదర్ నాగబాబు 'ఖైదీ నెంబర్ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే కారణమయ్యాయి. చాలా తీవ్రమైన స్వరంతో నాగబాబు, కొందర్ని ఉద్దేశించి హెచ్చరికలు చేశారు. మెగాస్టార్‌నీ, మెగా కుటుంబాన్నీ ఉద్దేశించి కొందరు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు నాగబాబుని బాధించినట్టున్నాయి. మా పేరు చెప్పుకుని పెద్దవాళ్ళవుదామనుకుంటున్నారేమో అని మొదలు పెట్టిన నాగబాబు, కొంచెం హద్దులు మీరిన వ్యాఖ్యలే చేయడం జరిగింది. ఎవరి పేరూ నాగబాబు చెప్పకపోయినప్పటికీ, ఎవర్నయితే నాగబాబు తిట్టారో వారు స్పందించక తప్పలేదు. వీరిలో ఒకరు ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్. ఈయన చిరంజీవికి సన్నిహితుడే. ఓ సందర్భంలో రామ్‌చరణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. ఆ వ్యాఖ్యల్ని నాగబాబు ఇప్పుడు ఈ వేదిక నుంచి ఖండించారు. ఇంకో వైపున సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మని నాగబాబు విమర్శించడం జరిగింది. ఆ విమర్శల్లోనే ఎక్కువగా తూలనాడేశారాయన. అయితే నాగబాబు వ్యాఖ్యల గురించి తెలుసుకున్న రామ్‌గోపాల్ వర్మ ముందుగా ట్విట్టర్‌లో క్షమాపణలు చెప్పారు. అయితే కాస్సేపటికే ఎవరో ఇడియట్ తన ట్విట్టర్ అకౌంట్‌ని హ్యాక్ చేసినట్లు పేర్కొంటూ, నాగబాబు మీద విమర్శలతో విరుచుకుపడ్డారు వర్మ. ఎవరు తూలనాడినా, ఎవరు పనిగట్టుకుని ఎవరి మీదన్నా విమర్శలు చేసినా సినీ పరిశ్రమలో ఇలాంటివి అవాంఛనీయం.