'కింగ్' నాగార్జున గతంలో హిందీ సినిమాల్లో నటించారు, తమిళంలో కూడా ఓ సినిమా చేశారు. తమిళంలో చేసిన 'రక్షకన్' సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అందులో సుస్మితా సేన్ హీరోయిన్. అప్పట్లో ఆ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందింది. ఇతర భాషల్లో మనకున్న మార్కెట్‌కి పరిగణనలోకి తీసుకుని సినిమాలు చేయడం మేలంటున్నాడు నాగార్జున. ఎప్పుడో 'బాహుబలి' లాంటి అద్భుతాలు జరుగుతాయనీ, అన్ని సినిమాలకీ అలా జరగాలనే రూల్ ఏమీ లేదని చెబుతున్న నాగార్జున, ఇతర మార్కెట్లపై ఇంట్రెస్ట్ చూపించడం తప్పులేదని అభిప్రాయపడ్డాడు. తెలుగు సినిమాల మీదనే తన ఫోకస్ ఉందని చెబుతూ ఇతర భాషల్లో మన సినిమాల పట్ల క్రేజ్ పెరుగుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామం అని వివరించాడు. 'రాజుగారిగది' సినిమాతో 'రాజుగారిగది-2' సినిమాని పోల్చలేమనీ, క్యాచీగా ఉంటుందని మాత్రమే ఆ టైటిల్ పెట్టారని అన్నాడు. ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రను 'రాజుగారిగది-2' సినిమాలో చేసినట్లు చెప్పిన నాగార్జున, ఇందులోని తన పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతాయనే విశ్వాసం వ్యక్తం చేశారు. 'హలో' సినిమా టైటిల్ క్యాచీగా ఉందనీ, అఖిల్ సినిమాకి ఈ టైటిల్ పక్కాగా సూటవుతుందని చెబుతూ స్వర్గీయ ఎన్టీఆర్‌తో మొదలు పెట్టి, అక్కినేని నాగేశ్వరరావుతో 'హలో' చెప్పిద్దామనుకున్నా కుదరకపోవడం వల్ల స్వర్గీయ ఎన్టీఆర్‌కి బదులు యంగ్‌టైగర్ ఎన్టీయార్‌తో చెప్పించినట్లు వెల్లడించారు.