వైఎస్ఆర్ చేసిన పాద యాత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం `యాత్ర`. వైఎస్ గా మమ్ముట్టి నటించారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఏపీలో వైకాపా విజయానికి పరోక్షంగా ఈ చిత్రం దోహదం చేసింది. ఇప్పుడు యాత్ర 2 తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నాడు మహి.వి.రాఘవ. యాత్రలో వైఎస్ఆర్ జీవితాన్ని చూపిస్తే.. యాత్ర 2 లో వైఎస్ వారసుడు జగన్‌మోహన్ రెడ్డి కథ చెప్పబోతున్నాడు. వైఎస్ మరణించిన తరవాత నుంచి ఈ కథ మొదలై.. సీఎంగా జగన్‌ప్రమాణ స్వీకారం చేయడంతో ముగియబోతోంది. ఇప్పుడు జగన్ పాత్ర కోసం హీరోని అన్వేషించే పనిలో పడ్డాడు మహి వి.రాఘవ.
ఆ పాత్రలో నటించే అవకాశాలు నాగార్జునకే ఎక్కువ ఉన్నాయని టాలీవుడ్ టాక్. నిజానికి యాత్రలోనే జగన్ పాత్రని సైతం చూపిస్తారని ప్రచారం జరిగింది. సూర్య, నాగార్జున పేర్లు ఆ సమయంలో పరిశీలనకు వచ్చాయి.కానీ జగన్ ప్రస్తావన లేకుండానే యాత్ర సినిమాని ముగించాడు మహి. ఇప్పుడు కేవలం జగన్ తోనే సినిమా తీయబోతున్నాడు కాబట్టి... ఆ పాత్రకు ఓ సమర్థుడైన కథానాయకుడు కావాలి. అందుకే నాగార్జునని బరిలోకి దింపబోతున్నట్టు టాక్. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చర్చల దశలోనే ఉంది. నాగార్జున ఓకే చెబితే ఈ సినిమాకు స్టార్ వాల్యూ అబ్బినట్టే.