కరోనా విలయతండవం చేస్తున్న వేళ ఇది. జనాలు బయటకు రావడానికే భయపడుతున్నారు. సెలబ్రెటీలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకున్నారు. నో సినిమాలు.. నో షూటింగ్స్. అలవాటు లేకపోయినా సరే, ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగులకు అనుమతులు ఇచ్చాయి. అయినా సరే, స్టార్లు ఎవరూ షూటింగులకు సిద్ధంగా లేరు. యువ హీరోలు రిస్క్ చేయడం వల్ల కొన్ని సినిమాల షూటింగులు మొదలయ్యాయి.
పెద్ద హీరోలూ బయటకు వస్తే తప్ప షూటింగులకు కళ రాదనుకుంటున్న సమయంలో.. నాగార్జున తొలి అడుగు వేశారు. తన కొత్త సినిమా `వైల్డ్ డాగ్` షూటింగ్‌ని మొదలెట్టారు. అంతేకాదు... `బిగ్ బాస్ 4` సీజన్‌కీ పచ్చ జెండా ఊపి - తనలోని తెగువ చూపించారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ కూడా షూటింగులకు సై అంటున్నారు. ఈనెలలోనే బోయపాటి శ్రీను సినిమా మొదలవ్వబోతోంది. అగ్ర కథానాయకుల్లో చిరంజీవి, వెంకటేష్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. చిరంజీవి `ఆచార్య`, వెంకీ `నారప్ప` షూటింగ్ దశలో ఉన్నాయి. `నారప్ప` మరో 20 శాతం షూటింగ్ బాకీ. `ఆచార్య` సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకుంది.
ఇప్పటి నుంచి షూటింగ్ మొదలెడితే.. ఆ లక్ష్యాన్ని చేరుకోవొచ్చు. అక్టోబరు నుంచి ఆచార్య షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వెంకీ నారప్ప కూడా అప్పుడే మొదలవుతుందట. ఇక చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ, అల్లు అర్జున్ లు కూడా రంగంలోకి దిగిపోతే.. టాలీవుడ్ కి ఇది వరకటి కళ వచ్చేస్తోంది. కానీ తస్మాత్ జాగ్రత్త. కరోనా ప్రమాదం పొంచి ఉంది. దాన్ని ఎదుర్కొంటూ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఎంటర్ టైన్ చేయడం ఈ హీరోలకు కత్తిమీద సామే.