సోగ్గాడే చిన్ని నాయిన సినిమాకి ప్రీక్వెల్ గా `బంగార్రాజు` తీయాలని నాగార్జున ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కల్యాణ్ కృష్ణ ఓ స్క్రిప్టుతో అన్నపూర్ణ కాంపౌండ్ చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేస్తూనే ఉన్నాడు. రెండు మూడేళ్ల తరవాత.. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. అతి త్వరలోనే.. ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. అయితే.. సినిమా మొదలవ్వడమే ఆలస్యం.. ఏక ధాటిగా ఈసినిమాని పూర్తి చేసేస్తార్ట. రెండే రెండు షెడ్యూల్స్ లో ఈ సినిమాని అవ్వగొట్టాలన్నది చిత్రబృందం ప్లాన్. దానికి కారణం.. సంక్రాంతి.
సోగ్గాడే చిన్ని నాయిన సంక్రాంతికే విడుదల అయ్యింది. ఆ సీజన్ నాగార్జునకి బాగా కలిసొచ్చింది. సోగ్గాడే రూ.50 కోట్ల మైలు రాయిని అందుకుంది. నాగార్జున కెరీర్‌లో రూ.50 కోట్ల క్లబ్ లో చేరిన సినిమా ఇదే. కాబట్టి.. ఈసారి కూడా సంక్రాంతినే దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమాని రూపొందిస్తున్నార్ట. ఎట్టిపరిస్థితుల్లోనూ 2022 సంక్రాంతికి `బంగార్రాజు`ని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. అందుకే ఉరుకులు, పరుగుల మీద ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేయాలనుకుంటున్నారు. నాగచైతన్య ఓ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక, శ్రియ కథానాయికలుగా నటిస్తున్నారు.