2022 సంక్రాంతి ఎలా ఉండబోతోంది? అనే విషయంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. `ఆర్.ఆర్.ఆర్` రాకతో... `భీమ్లా నాయక్`, `సర్కారు వారి పాట` పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాయి. అయితే కొత్త డేట్ల విషయంలో ఇంకా ఓ స్పష్టత రావాల్సివుంది. ఈ సంక్రాంతికి రాధే శ్యామ్ - RRR కీ మధ్యనే ప్రధానమైన పోటీ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ రెండు సినిమాల మధ్య `బంగార్రాజు` నేను సైతం అంటూ పోటీకి దిగడానికి రెడీ అవుతున్నాడట.
సోగ్గాడే చిన్ని నాయిన చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రం బంగార్రాజు. ఇటీవల సెట్స్‌పైకి వెళ్లింది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగ చైతన్య కీలక పాత్రధారి. 2022 సంక్రాంతి టార్గెట్ తోనే సినిమా మొదలైంది. కాకపోతే.. RRR రాకతో ప్లానింగ్ అంతా మారిపోయింది.
పవన్, మహేష్ సినిమాలే వాయిదా పడుతుంటే... నాగార్జున వస్తాడేంటి? అని లైట్ తీసుకున్నారంతా. కానీ.. నాగార్జున మాత్రం ఈ సంక్రాంతికి సినిమా విడుదల చేయడం ఖాయంటున్నాడని సమాచారం. ఎన్ని సినిమాలు పోటీలో ఉన్నా సరే, బంగార్రాజుని రెడీ చేస్తానని, సంక్రాంతి బరిలో దింపుతానని అంటున్నాడట. నిజంగా ఇది పెద్ద రిస్కే. RRR కి భయపడి - మహేష్, పవన్ సినిమాలే వెనక్కి తగ్గిన వేళ... నాగ్ ముందుకు దూకడం సాహసోపేతమైన నిర్ణయమే. మరి నాగార్జునకు బంగార్రాజు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడో చూడాలి.