పూరి జగన్నాథ్ తనయుడిగా ఆకాష్ పూరి... నటుడిగా రంగ ప్రవేశం చేశాడు. పూరి సినిమాల్లో చిన్నప్పటి హీరో పాత్రలు చాలా చేశాడు. ఆ తరవాత `మెహబూబా`తో హీరోగా అవతారం ఎత్తాడు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. దాంతో కొంత విరామం తీసుకుని `రొమాంటిక్` సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసినిమాపై పూరి ఆకాష్ చాలా ఆశలే పెంచుకున్నాడు. ఈసినిమా తప్పకుండా హిట్ అవుతుందని, ఈ సినిమా చూసి తన తండ్రి కాలర్ ఎగరేస్తాడన్న నమ్మకం ఉందని అంటున్నాడు ఆకాష్.అంతే కాదు.. త్వరలోనే డైరక్షన్ వైపు కూడా వచ్చేస్తాడట. కానీ దానికి కొంత సమయం పడుతుందని అంటున్నాడు.
''తప్పకుండా ఏదో ఓ రోజు.. డైరెక్షన్ చేస్తా. మా నాన్న కథతోనే దర్శకుడ్ని అవుతా. అందుకోసం నాన్నకు మంచి పారితోషికం కూడా ఇచ్చుకుంటా. అయితే ముందు హీరోగా నిలదొక్కుకోవాలి. ఆ తరవాతే దర్శకత్వం గురించి ఆలోచిస్తా'' అని చెబుతున్నాడు ఆకాష్ పూరి. తను నటించిన `రొమాంటిక్` ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఈచిత్రానికి పూరి జగన్నాథ్ కథ, మాటలు అందించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారు. రమ్యకృష్ణ ఓ కీలక పాత్రధారి. కేతిక శర్మ కథానాయికగా నటించింది. ఇప్పటికే ఈ చిత్రంలోని గీతాలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తోంది.