ఓ వెబ్‌సైట్ నిర్వాకంపై తెలుగు సినీ పరిశ్రమ అసహనం వ్యక్తం చేస్తోన్న విషయం విదితమే. కొన్నేళ్ళ క్రిందటే పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు తదితరులు ఈ అంశం గురించి ప్రస్తావించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా స్పందించాడు. ప్రస్తుతం వివాదం ముదిరి పాకాన పడింది. విజయ్ దేవరకొండ విడుదల చేసిన వీడియోతో ఈక్వేషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. మెగాస్టార్ స్పందన తర్వాత, కింగ్ నాగార్జున సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
విజయ్ దేవరకొండకు మద్దతుగా నిలబడటం గొప్ప విషయం. కానీ, ఇది సరిపోదు. యాక్షన్ ప్లాన్ కావాలి.. అంటూ అక్కినేని నాగార్జున చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. కాగా, సదరు వెబ్‌సైట్‌కి సినీ ప్రకటనలు నిలిపివేస్తూ సినీ పరిశ్రమ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరోపక్క, ఆయా సినీ నిర్మాణ సంస్థలు ఈ అంశంపై సీరియస్‌గా స్పందిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తామంటూనే, సినీ పరిశ్రమను కించపర్చేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాయి. కాగా, సినీ పరిశ్రమ కూడా ఈ తరహా పోకడలపై సీరియస్‌గా చర్చిస్తోంది. కొద్ది రోజుల్లోనే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.