తెలుగు సినీ పరిశ్రమను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సంసిద్ధంగానే వుంటుందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు ఈ రోజు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో సమావేశమయ్యారు.
కరోనా వైరస్ నేపథ్యంలో సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సినీ ప్రముఖులు, మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ‘ఇన్ని రోజులు కష్టపడ్డాం. ఇంకొన్ని రోజులు ఓపిక పడ్దాం. తెలుగు సినీ పరిశ్రమకు ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా ప్రభుత్వం చేస్తుంది. అది ప్రభుత్వ బాధ్యత. లాక్‌డౌన్ ముగిశాక పరిశ్రమ పెద్దలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేస్తుంది. అప్పుడు అన్ని విషయాల్నీ పరిగణనలోకి తీసుకుంటాం. తెలుగు సినీ పరిశ్రమ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ కష్ట కాలం తాత్కాలికమే’ అని తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు.
మంత్రిని కలిసినవారిలో సి.కళ్యాణ్, దిల్ రాజు సహా పలువురు సినీ ప్రముఖులున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగులు ఆగిపోయాయి. సినిమాల రిలీజ్‌లు కూడా ఆగిపోయాయి. దాంతో, సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అయినాగానీ, సినీ పరిశ్రమ తరఫున పలువురు ప్రముఖులు కరోనా వైరస్ నేపథ్యంలో పేదల్ని ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. మరోపక్క, సీఎం రిలీఫ్ ఫండ్‌కి కూడా పెద్దయెత్తున విరాళాలు అందిస్తున్న విషయం విదితమే.