అక్కినేని నాగార్జున ఈమధ్య తన కెరీర్లో కాస్త స్లో అయినట్టు కనిపిస్తున్నారు కానీ అదేమీ లేదు. 'వైల్డ్ డాగ్' అనే ఒక పోలీస్ డ్రామాలో నటిస్తున్నారు. ఇది కాకుండా మరో రెండు సినిమాలలో కూడా నటిస్తున్నారు. హిందీలో రణబీర్-అలియా-అమితాబ్ బచ్చన్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర' లో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. సినిమా ఈ ఏడాది లోనే రిలీజ్ అవుతుంది.
ఇవి కాకుండా ధనుష్ హీరోగా నటిస్తూ స్వీయదర్శకత్వం వహించే ఒక తమిళ సినిమాలో కీలక పాత్రకు చాలా రోజుల క్రితమే పచ్చజెండా ఊపారు. అయితే నిర్మాణ సంస్థ ఆర్ధిక సమస్యలలో కూరుకుపోవడంతో సినిమా ఆలస్యం అయింది. దీంతో ఈ సినిమా అటకెక్కినట్టేనని అందరూ భావించారు. కానీ ఈ సినిమా అలా అటకలు డాబాలు ఏవీ ఎక్కలేదని కొలీవుడ్ గూఢచార వర్గాలు సమాచారం అందిస్తున్నాయి. నిర్మాతకు ఆర్థిక సమస్యలు తొలగిపోవడంతో సినిమా షూటింగ్ ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు.
ఈ లెక్కన త్వరలో నాగార్జున ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని అంటున్నారు. ఈ సినిమాకు 'రుద్ర' అనే టైటిల్ అనుకుంటున్నారట. నిజానికి ఈ నాగార్జున చేస్తున్న పాత్రను మొదట రజనీకాంత్ చేత చేయించాలని ధనుష్ భావించారట. కుదరకపోవడంతోఅప్పట్లో నాగ్ ను సంప్రదించడం.. ఒప్పుకోవడం చకచకా జరిగాయట. చాలా ఏళ్ల తర్వాత నాగార్జున నటిస్తున్న స్ట్రెయిట్ తమిళ సినిమా కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.