మన్మథుడు 2 తరవాత.. నాగార్జున సినిమా ఏదీ బయటకు రాలేదు. `వైల్డ్ డాగ్` పూర్తయినా ఇప్పటి వరకూ ఆ సినిమాని సంబంధించిన అప్ డేట్ లేదు. ఇది ఓటీటీ సినిమా అని ప్రచారం సాగింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా విడుదల చేస్తారని, థియేటర్లలో రాదని అనుకున్నారు. దానికి తగ్గట్టే నెట్ ఫ్లిక్స్ తో దాదాపుగా 35 కోట్లకు బేరం కుదిరింది. నాగ్ సినిమాకి ఇది మంచి ఆఫరే. అయితే ఇప్పుడు నాగార్జున ఈ సినిమా విషయంలో నిర్ణయం మార్చుకున్నట్టు టాక్.
ఓటీటీ కంటే ముందు థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేయాలని ఆయన భావిస్తున్నార్ట. లాక్ డౌన్ సమయంలో, థియేటర్లు తెరచుకోకపోవడంతో ఈ సినిమాని ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారని, అయితే ఇప్పుడు థియేటర్లు తెరచుకున్నాయి కాబట్టి, 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు లభించాయి కాబట్టి, థియేటర్ రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారని తెలుస్తోంది. కనీసం థియేటర్ రిలీజ్ కీ ఓటీటీ రిలీజ్ కి వారం రోజులైనా గ్యాప్ ఉండేలా చూడాలని నిర్మాతలకు సూచించార్ట. అయితే ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ తో ఓటీటీ బేరం అయిపోయింది. ఇప్పుడు థియేటరికల్ రిలీజ్ అంటే వాళ్లేమంటారో??