శ్రీవిష్ణు తాజా చిత్రం 'అల్లూరి'. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 23న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈసినిమా ట్రైలర్ ని హీరో నాని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు కోసం ఒక ఆసక్తికరమైన సంగతి చెప్పారు. ''సినిమా చేస్తే హీరో కాకుండా పాత్రలు మాత్రమే కనిపించే హీరోలు చాలా తక్కువమంది వుంటారు. అలాంటి నటుల్లో ముందు వరుసలో వుండే హీరో శ్రీవిష్ణు. అందుకే శ్రీవిష్ణు అంటే నాకు చాలా ఇష్టం. శ్రీవిష్ణు కథల ఎంపిక చాలా బావుంటుంది''అని కితాబిచ్చారు నాని.
''నిజానికి విష్ణు రియల్ లైఫ్ లో చాలా పెద్ద ఎంటర్ టైనర్. పర్శనల్ గా శ్రీవిష్ణుని కలిసినప్పుడు అతని విశ్వరూపం చూశాను. విష్ణులో ఆ ఎంటర్ టైనర్ కోణం కూడా బయటికి రావాలని కోరుకుంటాను. అది మీ అందరికీ నచ్చుతుంది. బయట చాలా రిజర్వడ్ గా వుండి లోపల చాలా సరదాగా ఉంటారని మహేష్ బాబు గారి గురించి విన్నాను. మహేష్ బాబు గారి తర్వాత శ్రీవిష్ణు ఆ కోవకి వస్తారు. శ్రీవిష్ణు కూడా అంత పెద్ద స్టార్ అవ్వాలి' అని కోరుకున్నారు నాని.