చేతిలో ఎప్పుడూ నాలుగైదు సినిమాలతో బిజీగా ఉండే హీరో నాని. ఫుల్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి.... తను మరింత బిజీగా మారాడు. ఇప్పుడు కూడా అంతే. `టక్ జగదీష్`, `శ్యాం సింగరాయ్` ఇవి రెండూ తన చేతిలో ఉన్నాయి. టక్ జగదీష్ విడుదలకు సిద్ధమైంది. శ్యాం సింగరాయ్ షూటింగ్ ఇంకా బాకీ ఉంది. వీటితో పాటు `అంటే.. సుందరానికి` అనే మరో సినిమా కూడా ఒప్పుకున్నాడు నాని. వివేక్ ఆత్రేయ దీనికి దర్శకుడు. నజ్రియా కథానాయిక. లాక్ డౌన్ కి ముందు ఈ సినిమా మొదలైంది. కొంత మేర షూటింగ్ కూడా జరిగింది. అయితే ఆ తరవాత ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అలికిడీ లేదు. ఎలాంటి అప్ డేటూ ఇవ్వలేదు. దాంతో అసలు ఈ సినిమా ఉందా? ఆగిపోయిందా? అనే అనుమానాలు నెలకున్నాయి.
లాక్ డౌన్, కరోనా వల్ల పరిస్థితులు చాలా మారిపోయాయి. మొదలైన సినిమాలు చాలా ఆగిపోయాయి. బడ్జెట్ సమస్యల వల్ల.. ఇంకొన్ని సినిమాలకు బ్రేకులు పడ్డాయి. `అంటే.. సుందరానికి` కూడా అదే జాబితాలోకి వెళ్లిపోయిందేమో అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. `అంటే సుందరానికి` స్క్రిప్టులో కీలకమైన మార్పులు, చేర్పులూ చేస్తున్నారని, దానికి కొంత సమయం పడుతుందని. `శ్యాం సింగరాయ్` పూర్తయిన తరవాతే నాని ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తాడని చెప్పుకుంటున్నారు. మరి.. అసలు నిజం ఏమిటో తెలియాలంటే చిత్రబృందంలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.