ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌తోనే అంచనాలు పెంచేసిన సినిమా 'అ'. యంగ్ హీరో నాని నిర్మాతగా రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాలోని ప్రతీ పాత్రనీ సరికొత్తగా పరిచయం చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది ఈ సినిమా. తాజాగా 'అ' టీజర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్.
టీజర్‌లో నాని వాయిస్ ఓవర్ ఇస్తున్న చేప మాట్లాడుతూ 'మీకొక కథ చెప్తా.. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులు వేటకు వెళ్లి నాలాంటి ఏడు చేపలను తీసుకొచ్చారు..' అంటూ ఏడుస్తూ చెబుతాడు. చెట్టుకు వాయిస్ ఓవర్ ఇస్తున్న రవితేజ 'విత్తనంగా ఉన్నప్పటి నుండీ ఇదే కథ వింటున్నాను కొంచెం కొత్తగా చెప్పరా..' అంటాడు. కొత్తగా అంటే ఈ టీజర్ చూడమంటాడు. అసలు కథ మొదలవుతుంది. అంతా అయ్యాక 'హీరో ఎవరో..' అని అడుగుతాడు. 'కథే హీరో' అంటాడు నాని. 'అ' అంటాడు రవితేజ. అదే టైటిల్ అంటాడు నాని. ఇలా ఈ ఇద్దరి వాయిస్ ఓవర్‌తో (అంటే చేప,చెట్టుల సంభాషణ) టీజర్ చాలా కొత్తగా అనిపించింది.
టీజర్ కోసం ఎంచుకున్న వీడియో బైట్స్ సింప్లీ సూపర్బ్. దాదాపు అన్ని పాత్రలూ టీజర్‌లో చూపించారు. దేనికదే ఇంతకు ముందు మనమెప్పుడూ చూడని విధంగా ఉన్నాయి పాత్రలు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, టీజర్ కటింగ్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. లుక్స్ పోస్టర్స్‌తోనే సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగారు. ఇప్పుడీ టీజర్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేస్తున్నాయ్. చిన్న సినిమా కాదిది. చాలా పెద్ద సినిమా అనే ఫీల్ టీజర్ ఇచ్చింది.