నాని కొత్త సినిమా `దసరా` విడుదలకు ముస్తాబవుతోంది. సోమవారం టీజర్ కూడా విడుదల చేశారు. నానిని ఇదివరకెప్పుడూ చూడని ఓ పాత్రలో చూడబోతున్నామన్న సంగతి టీజర్ చెప్పేసింది. రా అండ్ రస్టిక్ లుక్‌లో ఉన్న ఈ టీజర్... అందరికీ తెగ నచ్చేసింది. ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి కూడా. అయితే ఓ బ్యాడ్ సెంటిమెంట్ మాత్రం నానినీ, ఆయన అభిమానుల్నీ కలవర పెడుతోంది.
`దసరా` సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగే కథ. ఈ విషయం దర్శక నిర్మాతలు ముందే చెప్పారు. టీజర్‌లోనూ అదే కనిపిస్తోంది. అయితే ఈ బ్యాక్ గ్రౌండ్ టాలీవుడ్ కి ఏమాత్రం కలిసి రాలేదు. సింగరేణి నేపథ్యంలో వచ్చిన తొలి తెలుగు సినిమా `నిప్పు రవ్వ`. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ మధ్య `వరల్డ్ ఫేమస్ లవర్` తో విజయ్ దేవరకొండ పోషించిన పాత్ర కూడా ఇదే. ఈ సినిమా కూడా డిజాస్టర్ లిస్టులో చేరిపోయింది. అందుకే... దసరా ఎలా ఉంటుందా? బ్యాడ్ సెంటిమెంట్ ఏమైనా కొనసాగుతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఈ సినిమాని హిట్ చేసి నాని ఈ బ్యాడ్ సెంటిమెంట్ ని చెరిపేస్తాడని టీజర్ చూశాక అందరికీ కాస్త నమ్మకం వచ్చింది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.