నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా రూపొందిన 'జెర్సీ' సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 12 ఓ పక్క హల్‌చల్ చేస్తోంటే, టాలీవుడ్ నుంచి కూడా క్రికెట్ సినిమాలు ప్రేక్షకుల్ని అలరించేస్తున్నాయి. ఇటీవలే నాగచైతన్య హీరోగా వచ్చిన 'మజిలీ' మంచి విజయాన్ని అందుకుంది. ఇది కూడా క్రికెట్ నేపథ్యంలో వచ్చిందే. 'జెర్సీ' కూడా క్రికెట్ నేపథ్యంలోనే తెరకెక్కింది. అయితే నాని, 'మజిలీ' సినిమాతో చూడలేదట అందుకే ఆ సినిమా గురించి తానేమీ మాట్లాడలేనని అంటున్నాడు.
ఇంతకీ 'జెర్సీ' సినిమాలో 'సాడ్' ఎండింగ్ వుంటుందా.? అని ప్రశ్నిస్తే, చాలా డిప్లమాటిక్‌గా సమాధానమిచ్చాడు హీరో నాని. 'సాడ్' ఎండింగ్ కాదని చెబితే, హ్యాపీ ఎండింగ్ అని ఒప్పుకున్నట్టే కదా! అని ఎదురు ప్రశ్నించాడు ఈ యంగ్ హీరో. నాని చాలా తెలివైనోడు మరి. అయితే, సినిమా చూశాక ప్రేక్షకుడు చిరునవ్వుతో ఆనందంగా బయటకు వెళ్తాడనీ, బోల్డంత పాజిటివ్ ఎనర్జీని తనతో తీసుకువెళ్ళడం ఖాయమనీ నాని భరోసా ఇస్తున్నాడు. అంటే 'జెర్సీ' సినిమాకి పాజిటివ్ ఎండింగేనన్నమాట.
నాని గతంలో నటించిన 'భీమిలి కబడ్డీ' జట్టుకి విషాదకరమైన ముగింపు ఇచ్చిన విషయం తెల్సిన విషయమే. దాంతో, ఆ విషయాన్ని నాని వద్ద మీడియా ప్రతినిథులు ప్రస్తావించారు. నాని డిప్లమాటిక్‌గా సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించినా, చివరకు పరోక్షంగా 'హ్యాపీ ఎండింగే' అని క్లారిటీ ఇచ్చేయాల్సి వచ్చిందన్నమాట.