వచ్చేవారం విడుదల కావాల్సిన 'సీత' సినిమా, మే నెలకి వాయిదా పడిందనే ప్రచారం జరుగుతోంది. కాజల్ అగర్వాల్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జంటగా తేజ దర్శకత్వంలో 'సీత' తెరకెక్కిన సంగతి తెల్సిందే. వాస్తవానికి 'సీత' నిర్మాణంలో చాలా జాప్యం జరిగింది. ఆ జాప్యమే లేకపోయి వుంటే, సినిమా ఈపాటికే విడుదలైపోయేదేమో. సినిమాపై 'బజ్' తక్కువగా వుండడం సహా అనేక కారణాలతో, 'సీత'పై అనుమానాలు రోజురోజుకీ పెరిగిపోతూ వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే 'సీత' యూనిట్ సస్పెన్స్‌కి తెరదించాలని చాలా ప్రయత్నాలు చేసినా, అవేవీ వర్కవుట్ అయ్యేలా కన్పించడంలేదు. తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో విన్పిస్తోన్న గాసిప్స్ ప్రకారం, మే 16వ తేదీకి సినిమా పోస్ట్‌పోన్ అయ్యిందని తెలుస్తోంది. అయితే ఈ విషయమై 'సీత' యూనిట్ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి స్పందనా లేదు. ఈ నెలాఖరున భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేసి, అదే వేదిక నుంచి కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తారని సమాచారమ్. దాదాపు 30 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని 'సీత' గురించి గాసిప్స్ వినిపిస్తున్నాయి.
తన సినిమాల బడ్జెట్‌కీ, వసూళ్ళకీ పొంతన లేకపోయినా, భారీ సినిమాలు చేస్తూ వస్తోన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఈసారి మాత్రం హైప్ విషయంలో కాజల్ మీదనే ఆధారపడాల్సి వచ్చేలా వుంది. బెల్లంకొండ గత చిత్రం 'కవచం' భారీ పరాజయాన్ని చవిచూసింది మరి. 'నేనే రాజు నేనే మంత్రి' తర్వాత తేజ చేస్తోన్న సినిమా ఇది.