టాలీవుడ్‌లో తనకంటూ ఓ మార్కెట్ సంపాదించుకొన్నాడు నాని. ఒక్కో సినిమాకీ ఎదుగుతూ.. ఇప్పుడు రూ.15 కోట్ల పారితోషికం తీసుకొనే స్థాయికి చేరుకొన్నాడు. రూ.2, 3 కోట్ల బడ్జెట్‌తో పూర్తయ్యే సినిమాల నుంచి మొదలెట్టి... నానిపై రూ.50 కోట్లు పెట్టే స్థితికి వచ్చాడు. టూ టైర్ హీరోల్లో.. తను మొదటి వరుసకు చేరుకొన్నాడు. అయితే ఎంత స్టార్ అయినా, వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతుంటే నిర్మాతలు మాత్రం ఏం చేస్తారు? నాని సినిమా అనేసరికి... ఇప్పుడు నిర్మాతలు ఆలోచనలో పడుతున్నారు. రెండు మూడేళ్లుగా నానికి ఏం కలిసి రావడం లేదు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన వి, టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్.. నిర్మాతలకు నష్టాలు మిగిల్చాయి. లేటెస్టుగా వచ్చిన `అంటే.. సుందరానికి` కూడా ఫ్లాపుల జాబితాలో చేరిపోయింది. ఈ ఎఫెక్టు ఇప్పుడు నాని తదుపరి సినిమా `దసరా`పై పడింది.
నాని కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం దసరా. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్ అవుతోందని టాక్. భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండడం వల్ల.. ఈ సినిమాకి ఇంత బడ్జెట్ అవుతోందని టాక్. రూ.50 కోట్ల బడ్జెట్ అనేసరికి నిర్మాతలు కూడా ఓకే అనుకొన్నారు. అయితే.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. వరుస ఫ్లాపుల దృష్ట్యా.. ఈ సినిమాకి ఇంత బడ్జెట్ పెట్టాలా? అంటూ నిర్మాతలు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. షూటింగ్ ని కొన్ని రోజలు ఆపి, మళ్లీ లెక్కలు వేయాలని, బడ్జెట్ ఎక్కడ తగ్గించుకోవాలో ఆలోచించుకోవాలని నిర్మాతలు భావిస్తున్నట్టు టాక్. కనీసం రూ.10 కోట్ల ఖర్చు తగ్గించాలని, లేదంటే.. ఈ సినిమా చేయి దాటిపోతోందని చిత్రబృందం భావిస్తోంది. మరి ఎక్కడ కోత వేస్తారో చూడాలి.