కేజీఎఫ్ తో పాపులారిటీ తెచ్చుకొంది శ్రీనిధి శెట్టి. అయితే ఆ తరవాత తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ శ్రీనిధి టెమ్ట్ అవ్వలేదు. అసలు ఈ అమ్మడికి తెలుగులో నటించాలని ఉందా, లేదా? అనే అనుమానమూ వేసింది. వాటిని పటాపంచలు చేస్తూ శ్రీనిధి ఇప్పుడు వరుసగా తెలుగు ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెట్టింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న 'తెలుసు కదా'లో శ్రీనిధి కథానాయికగా నటిస్తోంది. తెలుగులో తాను సంతకం చేసిన తొలి సినిమా ఇదే. ఇటీవల రానా హీరోగా నటించే ఓ సినిమాలోనూ తాను కథానాయికగా ఎంపికైందన్న వార్తలొచ్చాయి. ఇప్పుడు మరో ఆఫర్ తన సొంతం చేసుకొందని సమాచారం.
హిట్ ఫ్రాంచైజీలో భాగంగా హిట్ 3 సెట్స్‌పైకి వెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నాని నిర్మాతాగా, హీరోగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. శైలేష్ కొలను దర్శకుడు. ఈ చిత్రంలో కథానాయికగా శ్రీనిధిని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. రానా ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. నాని హీరోగా 'సరిపోదా శనివారం' సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 29న ఈ చిత్రం విడుదల కానుంది. ఆ తరవాత 'హిట్ 3' పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.