నాని అంటే మినిమం గ్యారెంటీ హీరో అని నిర్మాతల నమ్మకం. పరిమిత బడ్జెట్ లో సినిమా తీయొచ్చు. బాగుంటే లాభాలొస్తాయి. అటూ ఇటూ అయినా పెద్దగా నష్టపోయేది ఉండదు. కాబట్టి.. నాని వెంట పడే నిర్మాతలు ఎందరో..?! కానీ ఈమధ్య నాని కూడా బడ్జెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. `వి` సినిమాకి రూ.40 కోట్లయ్యాయి. టక్ జగదీష్ కి కూడా అటూ ఇటూగా అంతే. `శ్యామ్ సింగరాయ్` రూ.55 కోట్లు తేలింది. అయితే ఈ మూడు సినిమాలూ ఫ్లాప్. ఈ సినిమాలు తీసిన, కొన్నవాళ్లు భారీగా నష్టపోయారు. అయితే ఈ తప్పుల నుంచి నాని పాఠాలు నేర్చుకోలేదు. తన తదుపరి సినిమా `దసరా`కి కూడా భారీగా ఖర్చు పెడుతున్నాడు. ఈ సినిమా బడ్జెట్ రూ.60 కోట్లన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్.
సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ముందు ఈ సినిమాని రూ.40 కోట్ల లోపే ముగించాలని అనుకొన్నారు. కానీ క్రమేణా బడ్జెట్ పెరుగుతూ పోయింది. చివరికి రూ.60 కోట్లకు తేలింది. ఓ కొత్త దర్శకుడిపై రూ.60 కోట్ల పెట్టారంటే కచ్చితంగా ఈసినిమా కథపై నిర్మాతలకు అమితమైన ప్రేమ, నమ్మకం కలిగి ఉండాలి. పైగా.. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని విడుదల చేద్దామనుకొంటున్నారు. పుష్ప.. కేజీఎఫ్ సినిమాల్లా... ఈ సినిమాకీ నార్త్‌లో క్రేజ్ సంపాదించగలిగితే.. రూ.60 కోట్లు పెద్ద మేటర్ కాదు. కాకపోతే.. నానికి వరుసగా ఫ్లాపులు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో, ఓ కొత్త దర్శకుడ్ని నమ్మి ఇంత పెట్టుబడి పెట్టించడం నిజంగా రిస్కే.