వామపక్ష భావజాలం తగ్గిపోయిన కాలమిది. నక్సల్ మూమెంట్ గురించి ఇప్పుడు థియేటర్ కి వస్తున్న చాలా మందికి తెలీదు. నక్సల్ నేపధ్యంలో సినిమాలు తీసే ఆర్ నారాయణ మూర్తి లాంటి దర్శకులు కూడా రైతుల సమస్యల వైపు వచ్చేశారు. ఇలాంటి నేపధ్యంలో వస్తుంది విరాటపర్వం. 1990 తెలంగాణ నక్సల్ మూమెంట్ నేపధ్యంలో రాసుకున్న కథ ఇది. మరి ఈ కథ ఇప్పటి జనాలకు కనెక్టింగా వుంటుందా ? ఇదే ప్రశ్న దర్శకుడు వేణు ఉడుగుల వద్ద ప్రస్తావిస్తే.. తనదైన సమాధానం ఇచ్చారు.
''నక్సల్ నేపధ్యం అనేది ఇక్కడ పాయింట్ కాదు.. కథలో వున్న ప్రధాన భావోద్వేగం ఏమిటనేది ముఖ్యం. ఒక దొంగల కుటుంబం వుంది. ఆ కుటుంబంలో ఒక ప్రేమకథ చెబితే తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నేపధ్యానికి సంబంధం లేదు. విరాటపర్వంలో ఒక అందమైన ప్రేమకథ చెబుతున్నాం. 1990లోని రాజకీయ సందర్భాన్ని ఒక వ్యక్తిగతమైన సంఘర్షణగా చూపిస్తున్నాం. ఇది అందరికీ గొప్ప అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతున్నాను. మానవ సంబంధాల నేపధ్యంలో చెప్పే కథలని ప్రేక్షకులు ఎప్పుడూ గొప్పగా ఆదరిస్తారు. విరాటపర్వం ఒక అమ్మాయి ప్రేమకథ. నక్సల్ నేపధ్యంలో వస్తున్న తొలి ప్రేమకథ ఇది'' అని చెప్పుకొచ్చారు వేణు. జూన్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.