విజయ్ దేవరకొండ - శివ నిర్వాణ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో సమంతని కథానాయికగా ఎంచుకున్నారు. ఈ చిత్రానికి `ఖుషి` అనే పేరు పెట్టారని సమాచారం. ఈ వారంలోనే లాంఛనంగా మొదలెడతారు. అన్నట్టు ఈ కథ ముందు నానికి చెప్పాడట శివ నిర్వాణ. నాని సినిమా నిన్ను కోరి తోనే శివ నిర్వణ దర్శకుడిగా అడుగుపెట్టాడు. ఆ సినిమా హిట్టయ్యింది. ఆ తరవాత మజిలీ వచ్చింది. టక్ జగదీష్ కోసం నానితో మళ్లీ జట్టు కట్టాడు శివ. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ కసిలోనే... నానికి మరో కథ చెప్పాడట శివ. అయితే.. నానికి అది నచ్చక పక్కన పెట్టేశాడు. ఆ తరవాత.. విజయ్ దేవరకొండకు అదే కథ చెప్పి, ఒప్పించుకున్నాడు శివ నిర్వాణ.
కశ్మీర్ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. సినిమా షూటింగ్ దాదాపుగా కశ్మీర్‌లోనే జరగబోతోంది. ఇప్పటికే లొకేషన్ల రెక్కీ కూడా పూర్తయిందని సమాచారం. మజిలీలో సమంత పాత్రకు మంచి పేరొచ్చింది. ఆ సినిమా కూడా బాగా ఆడింది. ఆ నమ్మకంతోనే... సమంత ఈ కథని ఓకే చేసిందట. ఈ సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ పాత్రలు రెండూ పోటా పోటీగా ఉంటాయని సమాచారం. మరి నాని వద్దన్న కథ విజయ్ దేవరకొండకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.