నాని నటించిన రెండు సినిమాలు వరుసగా ఓటీటీకి వెళ్లిపోయాయి. `వి` సమయంలో పెద్దగా గొడవ జరగలేదు గానీ.... `టక్ జగదీష్` ఓటీటీకి ఇవ్వడం ఎగ్జిబీటర్లకు నచ్చలేదు. ఈ విషయమై.. పెద్ద దుమారమే నడిచింది. భవిష్యత్తులో నాని సినిమాల్ని బ్యాన్ చేస్తామని హెచ్చరించారు. దీనికి నాని కూడా చక్కగానే సమాధానం చెప్పాడు. ఈలోగా నాని సినిమా `శ్యామ్ సింగరాయ్` కూడా ఓటీటీలోనే విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. నాని కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీకి విడుదల చేయడం రిస్కే. మంచి డీల్ వస్తే... ఓటీటీకి ఇచ్చేయాలని నిర్మాతలు ఫిక్సయ్యారు.
అయితే నాని మాత్రం ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేయాలని గట్టిగా చెప్పాడట. నష్టాలొచ్చినా సరే.. ఈ సినిమాని ఓటీటీకి ఇవ్వకూడదని పట్టుపట్టాడట. ఈ సినిమా వల్ల నష్టపోతే.. పారితోషికం వెనక్కి ఇస్తానని నిర్మాతలకు హామీ ఇచ్చాడని తెలుస్తోంది. ఎందుకంటే `టక్ జగదీష్` వల్ల ఇప్పటికే నాని కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సివచ్చింది. ఆ తప్పు మళ్లీ చేయడం నానికి ఇష్టం లేదు. అందుకే ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడట.