వరుస విజయాలతో నాని సినిమా అంటే ఖచ్చితంగా హిట్టే అనే ఇమేజ్‌ని సంపాదించుకున్నాడు. అయితే ఒక్క సినిమాతో ఆ ఇమేజ్‌కి డ్యామేజ్ పడిపోయిందనే విమర్శలు వస్తున్నాయి ప్రస్తుతం నేచురల్ స్టార్ నానికి. ఇటీవల 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాని ఎప్పటిలాగే హిట్ కొట్టేస్తాడని ఆశించారంతా. కానీ అనూహ్యంగా ఆ సినిమాతో బోల్తా కొట్టేశాడు నాని. నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద నీరసించింది ఈ సినిమా. దాంతో నాని రేసులో కాస్త వెనకబడిపోయాడు.
అంతేకాదు, ఇంతవరకూ నాని నటనను మెచ్చుకున్న వారు కూడా రెగ్యులర్ స్టోరీస్‌నే ఎంచుకుంటున్నాడు. కాస్తైనా కొత్తదనం చూపించలేకపోతున్నాడనే విమర్శలు బాగా ఎక్కువయ్యాయి. దాంతో నాని ఆలోచనలో పడ్డాడట. ఈ సారి చేయబోయే సినిమాల్లో కాస్త కొత్తదనం చూపించాలనే ఆలోచన చేస్తున్నాడట. అంతేకాదు, ఖచ్చితంగా హిట్ కూడా కొట్టాలనుకుంటున్నాడట. అందుకే డైరెక్టర్స్ ఎంపికలోనూ, స్టోరీల ఎంపికలోనూ కాస్త దూకుడు తగ్గించి, తెలివిగా ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం నాని, నాగార్జునతో మల్టీ స్టారర్‌లో నటిస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్‌ని లైన్‌లో పెట్టి ఉంచడం నానికి అలవాటు. ఆ అలవాటుతోనే నాని లిస్టులో ఆల్రెడీ ముగ్గురు డైరెక్టర్స్ ఉన్నారు. వారే విక్రమ్ కుమార్, అవసరాల, హను రాఘవపూడి. అయితే వారిలో ఎవరి సినిమాకి ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నాని ఆలోచిస్తున్నాడట. అయితే ఆ వరుసలో 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాతో మంచి హిట్ ఇచ్చిన హను పేరు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి నాని ఏం చేస్తాడో.!