విడుదలకు సిద్ధమై, థియేటర్ల మూత వల్ల, ఆగిపోయిన సినిమాలన్నీ ఇప్పుడు ఓటీటీ వైపు చూస్తున్న విషయం తెలిసిందే. వచ్చిన రేటు కాడికి సినిమాని అమ్ముకుని బయటపడే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. కొన్ని సినిమాలకు మంచి రేటు కూడా వస్తోంది. `వి` సినిమా 33 కోట్లకు అమ్ముడుపోయిందని, త్వరలోనే అమేజాన్ లో ఈ సినిమా విడుదల కాబోతోందని ఓ వార్త చక్కర్లు కొట్టింది. `వి` సినిమాకొచ్చిన రేటు గురించి... విడుదల తేదీ గురించీ ఆసక్తిగా మాట్లాడుకున్నారు సినీ జనాలు.
అయితే.. ఈ సినిమాని అమేజాన్ ప్రైమ్ లో విడుదల చేయడం లేదని, థియేటర్లలోనే తీసుకొస్తారని చిత్రబృందం అంటోంది. `వి` సినిమా గురించి వచ్చిన వార్తలన్నీ నిరాధారమే అని, తమ సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తామని దిల్ రాజు కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో `వి` సినిమా వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్టైంది. నిజానికి అమేజాన్ ప్రైమ్ తో దిల్ రాజు సంప్రదింపులు జరిపారు. ఈ సినిమాకి సంబంధించిన బేరసారాలూ జరిగాయి. కానీ ఎక్కడ ఏమైందో గానీ, దిల్ రాజు తన నిర్ణయాన్ని మళ్లీ మార్చుకున్నారు.