సినీ రంగం సెంటిమెంట్ల మయం. ప్రతీ ఒక్కరికీ ఏదో ఓ సెంటిమెంట్ ఉంటుంది. నాని కూడా అలానే సెంటిమెంటల్ గా ఫీలయ్యాడు.. `వి` సినిమా విషయంలో. సెప్టెంబరు 5 తన జీవితాన్ని మలుపు తిప్పిన రోజు. కథానాయకుడిగా తన తొలి చిత్రం `అష్టా చమ్మా` ఆ రోజే విడుదలైంది. 25వ సినిమానీ అదే రోజున విడుదల అవుతుందనుకున్నాడు. అమేజాన్ కూడా సెప్టెంబరు 5నే ఈ సినిమాని విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ.. 4వ తేదీ రాత్రి 10 గంటలకే ఈ సినిమాని స్ట్రీమింగ్కి పెట్టేసింది. అంటే.. ఈ సినిమా 4వ తేదీనే విడుదల అయినట్టు.
నిజానికి అర్థరాత్రి 12 గంటల 5 నిమిషాలకు విడుదల కావాల్సిన ఈ సినిమాని 2 గంటల ముందే అందుబాటులోకి తీసుకొచ్చేసింది అమేజాన్. దాంతో నాని సెంటిమెంట్ లెక్క తప్పిపోయినట్టైంది. అమేజాన్ లో ఈ సినిమా ముందే వచ్చేస్తుందన్న విషయం నానికి గానీ, వి చిత్రబృందానికి గానీ తెలియదట. అదీ.. అసలైన విచిత్రం. దానికి తగ్గట్టే ఈసినిమాకి నెగిటీవ్ రివ్యూలు వస్తున్నాయి. ఇదంతా సెంటిమెంట్ తప్పినందుకేనా? అన్న గుసగుసలూ వినిపిస్తున్నాయిప్పుడు.