కథల ఎంపికలో కొత్తదనం చూపించడం అనే మాటకొస్తే తమిళ హీరోలు, తెలుగు హీరోలకన్నా చాలా ముందుంటారు. తమిళం కన్నా మలయాళంలో ఎక్కువగా కొత్తదనంతో కూడిన సినిమాలు వస్తుంటాయి. మలయాళ సినిమా మార్కెట్ పరిధి తక్కువ. తమిళ సినిమా మార్కెట్ పరిధి ఎక్కువే. తెలుగు సినిమా మార్కెట్ - తమిళ సినిమా మార్కెట్ పోటీ పడ్తుంటాయి. ఈ మార్కెట్ దగ్గరే కమర్షియల్ బంధనం అనేది ఉంటుంది. అయితే ఆ మార్కెట్ బంధనాన్ని తెంచుకుని తమిళంలో ప్రయోగాలు చేస్తుంటారు. తెలుగులో ప్రయోగాలు కాస్త తక్కువే. కానీ ఈ మధ్య ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాల వైపు మన కథానాయకులు అడుగులేస్తున్నారు. సినిమా సినిమాకీ కొత్తదనం కోరుకునే కథానాయకుల్లో నారా వారబ్బాయ్ ముందుంటారు. నారా రోహిత్ తొలి సినిమా 'బాణం' నుంచి మొన్నీమధ్యన వచ్చిన 'అప్పట్లో ఒకడుండేవాడు' దాకా విభిన్న కథా చిత్రాల్నే ఎంపిక చేసుకున్నాడు. తాజాగా అతని నుంచి ఇంకో కొత్తదనంతో కూడిన సినిమా రాబోతోంది. అదే 'కథలో రాజకుమారి'. ఫస్ట్ లుక్ చూడగానే ఇదేదో తమిళ సినిమా అనే ఫీలింగ్ కలుగుతుంది. తెలుగుదనంతో కూడిన టైటిల్ పెట్టి, అరవ స్టయిల్‌లో చేస్తున్నాడేంటబ్బా? అనుకోవచ్చు. కానీ, ఇది మన కథ అన్పించేలా ఉందని మనం మర్చిపోతున్నాం. గెటప్‌లో అరవ వాసన ఉందనేది కేవలం భ్రమ మాత్రమే. అలా మనం తమిళ సినిమాల్లో ఆ ఫ్లేవర్‌కి అలవాటుపడిపోయాం. ఏదేమైనప్పటికీ నారా రోహిత్ 'కథలో రాజకుమారి' ఫస్ట్ లుక్‌తో నూటికి నూరు మార్కులూ కొట్టేశాడు.