'నవాబ్' టైటిల్‌తో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందుతోంది. తాజాగా ట్రైలర్ విడుదలైంది.
ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని నాగార్జున సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగార్జునకు 'గీతాంజలి' వంటి సూపర్ బ్లాక్ బస్టర్ సినిమాని అందించారు మణిరత్నం. ఇటీవల కార్తి, అదితీరావ్ హైదరీ కాంబినేషన్‌లో 'చెలియా' సినిమాని తెరకెక్కించారు మణిరత్నం. ఆ సినిమా ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయింది కానీ, తాజా చిత్రం 'నవాబ్' విషయానికి వస్తే, తెర నిండా తారలే. ఆషా మాషీ తారలు కాదు వారు. తమిళ హేమా హేమీ నటీ నటులు ఈ సినిమాలో కనిపిస్తున్నారు.
ట్రైలర్‌లో అందరికీ చోటు దక్కింది. అరవింద్ స్వామి, శింబు, ప్రకాష్‌రాజ్, అరుణ్ శరత్ కుమార్, విజయ్ సేతుపతి, జయసుధ, అదితీరావ్ హైదరీ, జ్యోతిక తదితరులు నటిస్తున్నారు. అందరివీ ఇంపార్టెంట్ రోల్స్‌లాగానే ట్రైలర్‌లో పరిచయం చేశారు. 'బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడా..? నమ్మొద్దు..' అని ట్రైలర్ ఎండింగ్‌లో అరవింద్ స్వామి చెప్పే డైలాగ్‌తో పాటు, చాలా కీలక డైలాగులున్నాయి ట్రైలర్‌లో.
ఇంత మంది స్టార్స్‌ని ఎట్ ఏ టైమ్ ఒకే స్క్రీన్‌పై మేనేజ్ చేయడమంటే అంత ఆషామాషీ విషయం కాదు. మణిరత్నం వంటి సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్‌కే అది సాధ్యం. అయితే ఇన్ని క్యారెక్టర్స్‌ని ఎలా డీల్ చేశారన్నది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకూ ఆగాల్సిందే. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.