సౌత్ లో ఒక వెలుగు వెలిగి లేడి సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార... బాలీవుడ్ లోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. 2024 లో నయనతారని వివాదాలు చుట్టుముట్టాయి. నయనతార 75వ సినిమా అన్నపూర్ణి మొదటి నుంచి వివాదాలను మూటగట్టుకుంది. ట్రైలర్ రిలీజ్ సమయం నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. గతేడాది డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చింది. డిసెంబర్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో వివిధ ప్రాంతాల నుంచి చూసిన ప్రేక్షకులు అన్నపూర్ణి సినిమాపై అభ్యంతరం తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కొన్ని సీన్సు ఉన్నాయంటూ డైరెక్టర్ నీలేష్ కృష్ణ, నిర్మాతలు, జీ స్టూడియో సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాలు భరించలేక నెట్ ఫ్లిక్స్ సంస్థ అన్నపూర్ణి స్ట్రీమింగ్ ఆపేసింది. దీనితో సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చిన సినిమాను నెట్ ఫ్లిక్ తొలగించటమేంటని, డైరెక్టర్ నీలేష్ కృష్ణ ఖండించారు.
ఎట్టకేలకు అన్నపూర్ణి మూవీ వివాదంపై నయనతార స్పందిస్తూ ఎవరైనా తమ సినిమా వల్ల హర్ట్ అయితే సారీ చెబుతూ ఇంగ్లీష్, హిందీ, తమిళంలో ఒక లేఖను పోస్ట్ చేసింది. జై శ్రీరామ్ అంటూ లేఖను ప్రారంభించిన నయనతార.. " అన్నపూర్ణి కేవలం సినిమాలాగా కాకుండా ఎలాంటి పరిస్థితులో అయినా ధైర్యాన్ని వీడకూడదనే స్ఫూర్తిని నింపడం కోసం చేసిన ప్రయత్నం. అన్నపూర్ణి చిత్రంలో ప్రతి ఒక్కరి జీవితానికి అద్దంపట్టి చూపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సంకల్పం ఉంటే ఎలాంటి కష్టాలను అయినా దాటవచ్చని చూపించాలని అనుకున్నాం. ఒక పాజిటివ్ సందేశం ఇచ్చే క్రమంలో తెలియకుండానే కొంతమందిని హర్ట్ చేసి ఉండొచ్చు. సెన్సార్ పూర్తై థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీ నుంచి తొలగిస్తారని మేము అస్సలు ఊహించలేదు" అని నయనతార పేర్కొంది.
"నా టీమ్ గానీ, నేను కానీ ఎవరి సెంటిమెంట్‌ను కావాలని బాధపెట్టాలని అనుకోలేదు. దేవుడిని బలంగా నమ్మి దేశవ్యాప్తంగా ఆలయాలకు తిరిగే వ్యక్తిగా నేను ఇలాంటి పని కావాలని ఎప్పుడూ చేయను. ఎవరి ఫీలింగ్స్ అయితే హర్ట్ అయ్యాయో వారికి నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. స్ఫూర్తిని ఇవ్వాలన్నదే అన్నపూర్ణి లక్ష్యం. బాధపెట్టాలని కాదు" అని నయనతార సారీ చెప్పింది. ఇప్పటికైనా ఈ వివాదం ముగుస్తుందో లేదో చూడాలి మరి.