నందమూరి బాలకృష్ణ హీరోగా కొత్త సినిమా ప్రారంభమయ్యింది. బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటిక 'సింహా', 'లెజెండ్' సినిమాలొచ్చాయి. ఆ రెండూ ఘనవిజయాలు సాధించాయి. బాలయ్యతో సినిమా అనగానే బోయపాటిలో పూనకం వచ్చేస్తుంటుంది. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చెప్పే డైలాగులూ ఇంకో లెవల్‌లో వుంటాయి. ఆ అంచనాల్ని దృష్టిలో పెట్టుకునే బోయపాటి, బాలయ్య కోసం బీభత్సమైన సబ్జెక్ట్‌ని రెడీ చేశాడు.
బాలయ్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. 'ఈ సినిమాతో బాలయ్య 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం..' అని బాలయ్య అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాయి. 'నువ్వొక మాటంటే అది శబ్దం.. అదే మాట నేనంటే అది శాసనం..' అంటూ బాలయ్య చెప్పే డైలాగ్‌ని ముహూర్తపు షాట్‌గా చిత్రీకరించారు. ఈ ఒక్క డైలాగ్ చాలు, బాలయ్యని బోయపాటి ఎంత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారో చెప్పడానికి. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా వుంటే, బాలయ్య హీరోగా రూపొందిన 'రూలర్' విడుదలకు సిద్ధమయిన విషయం విదితమే.