మరి కొద్ది గంటల్లో ఆస్కార్ సంరంభం మొదలు కాబోతోంది. ఆర్.ఆర్.ఆర్‌కి ఆస్కార్ వస్తుందా? రాదా? అంటూ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది భారతావని. అందరి దృష్టీ అటువైపే ఉంది. ఇలాంటి దశలో... తెలుగు నాట, సినిమా వాళ్ల మధ్య మాటలు, తూటాల్లా పేలుతున్నాయి. ఆర్.ఆర్.ఆర్‌కి ఆస్కార్ తేవాలన్న ఉద్దేశంతో రాజమౌళి దాదాపు 80 కోట్లు ఖర్చు పెట్టారని, భారీ ఎత్తున లాబియింగ్ చేయిస్తున్నారని, ఆ డబ్బుతో.. 8 సినిమాలు తీసేయొచ్చని... కీలకమైన వ్యాఖ్యలు చేశారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా. దీనిపై ఇప్పుడు రాఘవేంద్రరావు స్పందించారు. తెలుగు సినిమాలకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకి ప్రపంచ వేదికపై మొదటిసారి వస్తున్న పేరుకి గర్వించాలి. అంతేకానీ.. 80 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా? జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు మన దగ్గర డబ్బు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా? అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా... ట్విట్టర్‌లో రెచ్చిపోయాడు. `నీ అమ్మ మొగుడు ఖర్చు పెట్టాడా రా రూ.80 కోట్లూ..` అంటూ తమ్మారెడ్డిపై ఆవేశాన్ని ప్రదర్శించారు. మెగా ఫ్యాన్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా.. ఇప్పుడు తమ్మారెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు. కొంతమంది.. తమ్మారెడ్డిని సపోర్ట్ చేసినవాళ్లూ ఉన్నారు.
దాంతో.. ఆర్.ఆర్.ఆర్ లాబీయింగ్ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఆస్కార్ లాంటి వేదికలపై సినిమాల్ని నిలబెట్టాలంటే, అవార్డు వరకూ చేరువ చేయాలంటే ఖర్చు పెట్టక తప్పదు. రాజమౌళి రూ.80 కోట్లు ఖర్చు పెట్టారా? లేదా? అసలు ఆ ఎకౌంట్స్ ఏమిటి? ఇవన్నీ అనవసరమైన విషయాలు. జేమ్స్ కామరూన్, స్పీల్ బర్గ్ లాంటి మేధావులు సినిమాలు తీసినా, అవి ఆస్కార్‌లు అందుకొన్నా.. వాళ్లూ ఇలాంటి ప్రాసెస్ చేసినవాళ్లే. పైగా ఆస్కార్ విషయంలో లాబియింగ్ చేయడం.. చట్టబద్ధం కూడా. ఇందులో ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఆర్.ఆర్.ఆర్‌కి ఆస్కార్ వస్తే... ఓ తెలుగువాడిగా, భారతీయుడుగా అంతా గర్వపడాల్సిందే. అలాంటి తరుణం కోసం ఎదురు చూస్తున్న వేళ.. ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపడం.. సమంజసం కాదు. ఇంత చిన్న విషయాన్ని తమ్మారెడ్డి లాంటి ఓ సీనియర్ నిర్మాత ఎలా మర్చిపోయాడో అర్థం కావడం లేదు. తమ్మారెడ్డి, రాఘవేంద్రరావు ఇలా కౌంటర్లు ఇచ్చుకోవడం వల్ల ఒరిగేదేం ఉండదు. పైపెచ్చు... ఆర్.ఆర్.ఆర్‌కి అవార్డు వచ్చినా...అది కేవలం లాబీయింగ్ వల్లే వచ్చిందని, కోట్లు ఖర్చు పెట్టడం వల్లే సాధ్యమైందన్న ముద్ర వేసేసే ప్రమాదం ఉంది.