చిత్రం: నేను స్టూడెంట్ సార్
నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్
దర్శకత్వం: రాఖీ ఉప్పలపాటి
నిర్మాత: సతీష్ వర్మ
సంగీతం: మహతి స్వర సాగర్
ఛాయాగ్రహణం: అనిత్ మధాడి
కూర్పు: ఛోటా కె ప్రసాద్
బ్యానర్: ఎస్వీ 2 ఎంటర్ టైన్ మెంట్
విడుదల తేదీ: 2 జూన్ 2023
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.5/5
`స్వాతిముత్యం`తో తెరంగేట్రం చేశాడు బెల్లంకొండ గణేష్. అన్నయ్య బెల్లంకొండ శ్రీనివాస్ లా కాకుండా సాఫ్ట్ కథలు ఎంచుకొంటున్నాడు. తొలి సినిమాతో నటుడుగా పాస్ అయ్యాడు. కాకపోతే ఓ కమర్షియల్ హిట్ కొట్టాలి. అందుకే ఈసారి ఎవర్ గ్రీన్ అయిన స్టూడెంట్ కథ ఎంచుకొన్నాడు. దానికి `నేను స్టూడెంట్ సార్` అనే టైటిల్ కూడా పెట్టారు. మరి ఈ సినిమాతో గణేష్ కోరుకొన్న హిట్టు దొరికిందా, లేదా? ఈ సినిమాలో ఉన్న విషయం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ: సుబ్బారావు (బెల్లంకొండ గణేష్) ఓ స్టూడెంట్. ఐఫోన్ అంటే ప్రాణం. ఇంట్లో వాళ్లని కష్టపెట్టకుండా తన సొంత డబ్బులతో ఐఫోన్ కొనుక్కోవాలని ఆశ పడతాడు. అందుకోసం డబ్బులు పోగేస్తాడు. చివరికి 90 వేలు సంపాదించి, ఫోన్ కొనేస్తాడు. దానికి బుజ్జిబాబు అని పేరు పెట్టుకొంటాడు. తమ్ముడిలా చూసుకొంటాడు. కానీ అదే రోజున స్టూడెంట్స్‌కీ, స్టూడెంట్స్‌కీ జరిగిన గొడవలో తన ప్రమేయం లేకుండానే పోలీస్ స్టేషన్‌కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ తన ఫోన్ మిస్ అవుతుంది. దాంతో పోలీసులే తన ఫోన్ దొంగిలించారని కేసు పెడతాడు. ఈ గొడవ కమీషనర్ (అర్జున్ వాసుదేవ్) వరకూ వెళ్తుంది. కమీషనర్ ఈ వ్యవహారంలో ఈగోకి వెళ్లి... సుబ్బుతో గొడవకు దిగుతాడు. కమీషనర్ నుంచి తన సెల్ ఫోన్ రాబట్టుకొనే ప్రయత్నంలో సుబ్బు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తాడు. అవి.. చివరికి తన మెడకే చుట్టుకొంటాయి. అసలు ఆ ఫోన్ ఏమైంది? ఫోన్ కోసం సుబ్బు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరికి బుజ్జిబాబు దొరికాడా, లేదా? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ: పాయింట్ గా చూస్తే... ఆసక్తికరంగానే ఉంది. ఓ ఫోన్ తో మొదలైన ఈ కథ, ఓ భారీ స్కామ్ వరకూ దారి తీయడం బాగుంది. అయితే.. ఫోన్ నుంచి.. స్కామ్ వరకూ వెళ్లే ప్రయత్నంలో కాస్త గజిబిజి, గందరగోళం కనిపిస్తాయి. కథని సాగదీయడం మరింత ఇబ్బంది కలిగిస్తుంది. ట్విస్ట్‌లు ఉన్నా - అవి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ స్థాయికి ఈ సినిమాని తీసుకెళ్లలేదు. క్యారెర్టరైజేషన్ లో ఉన్న లోపాలు కూడా విసిగిస్తాయి. ఐ ఫోన్ అంటే హీరోకి ఎంత ఇష్టమో చూపిస్తూ కథని మొదలెట్టారు.
ఐ ఫోన్ కొనడం, కొన్న రోజే పోవడం, అదే రోజు పోలీస్ స్టేషన్ గొడవ, కమీషనర్ తో వాగ్వాదం.. ఇలా తొలి అరగంటలోనే కథ మెయిన్ ట్రాక్ ఎక్కేస్తుంది. అయితే ఆ తరవాత.. క్రమంగా డౌన్ ఫాల్ మొదలవుతుంది. కమీషనర్ కూతుర్ని లైన్ లో పెట్టడానికి హీరో చేసే ప్రయత్నాలు ఏమాత్రం ఆసక్తిని కలిగించవు. కథ.. అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఓ మర్డర్ కేసు హీరో నెత్తిమీద పడడంతో ఇంట్రవెల్ బ్యాంగ్ బాగానే ప్లాన్ చేశారు.
సెకండాఫ్ మరింత రేసీగా ఉండాల్సింది. కానీ.. ఫస్టాఫే బాగుందేమో అన్న ఫీలింగ్ కలిగిస్తుంది. ముందు ఫోన్ చుట్టూ, ఆ తరవాత గన్ చుట్టూ కథని సాగదీశారు. చివరికి బ్యాంక్ స్కామ్ వరకూ వెళ్లారు. బ్యాంక్ స్కామ్ ఎలా జరుగుతోంది? అందులో స్టూడెంట్స్ ని ఎలా వాడుకొంటున్నారు? అనే పాయింట్ ఆసక్తికరంగా ఉంది. కానీ ఈ కథని వేరే కోణంలో మొదలెట్టి, బ్యాంకు స్కామ్ లోకి దింపడం బాగోలేదు. దాంతో ఒకే సినిమాలో రెండు కథలు చూసినట్టు అనిపిస్తుంది.
పోయిన సెల్ ఫోన్ కీ, ఈ బ్యాంకు స్కాముకీ సంబంధం ఉంటే.. కథ మరోలా ఉండేది. కానీ.. రెండింటికీ లింకు లేదు. విలన్ ఎవరన్న ఆసక్తి ప్రేక్షకులకు కలిగితే.. క్లైమాక్స్ ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఎంత సేపూ.. ఫోన్ హీరోకి దొరుకుతుందా, లేదా? అనేది తప్ప.. విలన్ ఎవరో తెలుసుకోవాలన్న ధ్యాస ప్రేక్షకుడికి కలగదు. దాంతో చివర్లో విలన్ రివీల్ అయినా, పెద్ద కిక్ దొరకదు.
నటీనటులు: బెల్లంకొండ గణేష్‌కి ఇది రెండో సినిమా. తొలి సినిమాతో పోలిస్తే కొంచెం బెటర్. కానీ ఇంకాస్త మెరుగవ్వాలి. ప్రతీ ఎమోషన్ కీ ఒకే ఎక్స్‌ప్రెషన్ అంటే.. ఎక్కువ కాలం సినిమాలు చేయలేడు. కథలు వైవిధ్యంగా ఎంచుకొంటున్నాడు కాబట్టి చూడగలం. భాగశ్రీ కుమార్తె అవంతిక ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తన నటన ఇంకా దారుణంగా ఉంది. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగోదు. సముద్రఖని వల్ల ఆయా సన్నివేశాలు నిలబడ్డాయి. కమీషనర్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. సునీల్ ఒకట్రెండు సీన్లలో కనిపించాడు. తన వల్ల ఒరిగిందేం లేదు.
సాంకేతిక నిపుణులు: రాఖీ ఉప్పలపాటికి ఇది తొలి సినిమా. అయినా సరే, ఈ కథని కొంత వరకూ బాగానే హ్యాండిల్ చేశాడనిపిస్తుంది. చిన్న పాయింట్ తో రెండున్నర గంటల సినిమా తీయడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ విషయంలో తనకు కొన్ని మార్కులు పడతాయి. మహతి స్వర సాగర్ పాటల కంటే నేపథ్య సంగీతం బాగుంది. పాటలకు ఈ సినిమాలో స్కోప్ లేదు. నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. ఫస్టాఫ్‌లో లవ్ ట్రాక్ ట్రిమ్ చేయాల్సింది. టిక్ టాక్ నేపథ్యం కూడా కుదరలేదు.
ప్లస్ పాయింట్స్:
కథా నేపథ్యం
ఇంట్రవెల్ బ్యాంగ్
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్
చిన్న పాయింట్ కావడం
ఫైనల్ వర్డిక్ట్: కొంచెం లాగ్ అయ్యింది సార్...