బాక్సాఫీసు దగ్గర ప్రభంజనం సృష్టించింది ఆర్.ఆర్.ఆర్. ఇప్పుడు.. అంతర్జాతీయ వేదికలపై కూడా తన సత్తా చాటుతోంది. నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ఆస్కార్ రేసులోనూ నిలిచింది. దాంతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు ఆర్.ఆర్.ఆర్ వశం అవుతున్నాయి. ఇటీవల అమెరికాలో జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు ఫంక్షన్లో ఏకంగా 5 అవార్డులు దక్కించుకొంది. ప్రతీ రోజూ.. ప్రపంచంలోని ఏదో ఓ మూల నుంచి.. ఆర్.ఆర్.ఆర్ కు అవార్డు అందుతూనే ఉంది. ఇదివరకెప్పుడూ చూడని వింత వింత పేర్లు, సంస్థలూ.. అవార్డులు ఇవ్వడానికి పోటీ పడుతున్నాయి. ఇదంతా చూసిన కొంతమంది.. ఆర్.ఆర్.ఆర్.. అవార్డుల్ని కొనుక్కొంటోంది అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ రేసులో ఉంది కాబట్టి, మిగిలిన సంస్థలు ఇచ్చిన అవార్డులు అందుకొని, ఆస్కార్ జ్యూరీ ని ప్రభావితం చేయొచ్చన్న ఉద్దేశంతో రాజమౌళి అండ్ టీమ్ కొన్ని ప్రైవేటు సంస్థలతో చేతులుకలిపి, అవార్డులు తమ సినిమాకే వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. దీని వెనుక రాజమౌళి స్ట్రాటజీ చాలా పెద్ద ఎత్తున నడుపుతున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే రాజమౌళికి అవార్డులు కొనుక్కోవాల్సిన అవసరం ఏమిటన్నది చాలామంది ప్రశ్న. ఆర్.ఆర్.ఆర్ సామాన్యమైన సినిమా కాదు. అంతర్జాతీయంగా ఖ్యాతి సంపాదించుకొంది. అలాంటి సినిమాలకు కాకపోతే.. దేనికి అవార్డులు వస్తాయి? భారతదేశం నుంచి ఓ సినిమా, అంతర్జాతీయ స్థాయిలో మెరవడం చాలా అరుదైన విషయం. హాలీవుడ్ సంస్థలు కూడా తెలుగు సినిమాకి అవార్డులు ఇవ్వడం వెనుక ప్రత్యేకమైన స్ట్రాటజీలేం ఫాలో అవ్వవు. కేవలం ప్రతిభను కొలమానంగా తీసుకొనే అవార్డులు ఇస్తారు. కొన్ని సంస్థల పేర్లు మనం ఇది వరకు వినలేదు. నిజమే. ఎందుకంటే... ఎప్పుడూ మన సినిమా ఆ స్థాయికి వెళ్లలేదు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం.. ఆస్కార్‌ని ఎవ్వరూ ప్రభావితం చేయలేరు. అన్ని రకాల ఒడపోతల తరవాతే.. అవార్డుల్ని ప్రకటిస్తారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటరిగిరీలో నాటు నాటు పాట నామినేషన్ పొందిందంటే ఆ పాటలో ఉన్న కెపబులిటీనే కారణం. అది మర్చిపోయి... అవార్డులు కొనుక్కొంటున్నారు అంటూ.. లేని పోని అపవాదు ఈ సినిమాపై వేస్తున్నారు. ఓ భారతీయ సినిమాకి, అందులోనూ తెలుగు సినిమాకి అంతర్జాతీయంగా అవార్డులు వస్తున్నాయంటే మనమంతా గర్వపడాలి. అంతే కానీ.. అనుమానించకూడదు.