`టికెట్ రేట్లు ఎలా ఉన్నా నాకు ఇబ్బందేం లేదు` అని నాగార్జున చేసిన కామెంట్ ఇప్పుడు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నాగ్ వ్యాఖ్యలు ఏపీలో జగన్ ప్రభుత్వానికి వత్తాసు పలికినట్టుగా ఉన్నాయని, ఇండ్రస్ట్రీకి చేటు చేసేలా మారాయని... ఫిల్మ్ నగర్ వర్గాలు నొసలు చిట్లిస్తున్నాయి. ఓ అగ్ర కథానాయకుడిగా, నిర్మాతగా నాగార్జున మాట్లాడాల్సిన మాటలు కావని కొంతమంది ఆగ్రహిస్తున్నారు. ఇండస్ర్టీ అంతా... టికెట్ రేట్ల వ్యవహారంలో గగ్గోలు పెడుతోంటే, తనకేం పట్టనట్టు వ్యవహరించడమే కాకుండా... అసలు ఇదేం సమస్యే కాదన్నట్టు నాగార్జున వ్యవహరించడం పిరికి చర్య అన్నది చాలామంది భావన. దాంతో.. సోషల్ మీడియాలో నాగార్జునని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. గతంలో ఇండ్రస్ట్రీ గురించి నాగ్ చేసిన కామెంట్లు, ఇప్పటి కామెంట్లతో పోలుస్తూ.. `ప్రభుత్వం మారితే, మాట కూడా మారుస్తావా` అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఆస్తులు కాపాడుకోవడం కోసం, స్వప్రయోజనాల కోసం నాగార్జున ఇలా వ్యాఖ్యానించడం సరికాదని విమర్శిస్తున్నారు.
నాగార్జున బంగార్రాజు ఈనెల 14న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో టికెట్ రేట్ల వ్యవహారం గురించి నాగ్ స్పందించాడు. టికెట్ రేట్లు తగ్గడం తనకు సమస్య కాదని వ్యాఖ్యానించాడు. దాంతో.. తన సినిమా బాగుంటే చాలన్నట్టు నాగ్ వైఖరి ఉందంటూ విమర్శిస్తున్నారు చాలామంది. కొందరైతే, ఏపీలో నాగ్ సినిమాని బహిష్కరించాలంటూ పిలుపు ఇస్తున్నారు. నాగ్ పై ఎప్పుడూ లేనంత విధంగా సోషల్ మీడియాలో ఘాటైన ట్రోలింగ్ జరుగుతోంది. ఇదంతా నాగ్‌కి చేరిందో, లేదో?