చిరంజీవి ఇటీవల కె.విశ్వనాథ్ ని కలుసుకుని, ఆయన ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భాన్ని పురస్కరించుకుని, విశ్వనాథ్ ని కలవడం, ఆయనపై చిరు తనకున్న ప్రేమ చూపించుకోవడం - తప్పేం కాదు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. గురు శిష్యుల బంధం.. అంటూ హెడ్డింగులు కూడా పెట్టారు. అయితే.. చిరు - విశ్వనాథ్ ల కలయికని సైతం కొంతమంది భూతద్ధంలో చూస్తున్నారు. కరోనా టైమ్ లో.. ఇంటి పట్టున ఉండక.. ఇలా తిరగడం ఎందుకు? 90లో ఉన్న పెద్దాయనని ఇబ్బంది పెట్టడం ఎందుకు? అంటూ కొంతమంది నెటిజన్లు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.
అవసరం అయితే తప్ప, బయటకు రాకుండా ఉండాల్సిన సమయం ఇది, చిరంజీవి లాంటి సెలబ్రెటీనే ఇలా చేస్తే.. మిగిలిన వాళ్ల మాటేంటి? గురు భక్తి ఉంటే, మరోలా చూపించుకోవాల్సింది. దానికి ఇంత ప్రచారం అవసరమా? అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇదంతా చూసి `కోడి గుడ్డుపై ఈకలు పీకకండి` అంటూ చిరు ఫ్యాన్స్ లైట్ తీసుకుంటున్నారు. చిరు - విశ్వనాథ్‌ల భేటీలో తప్పేముంది? అని ప్రశ్నిస్తున్నారు. కాకపోతే.. సమాజిక దూరం పాటిస్తే బాగుంటుందన్న సలహాలూ ఎక్కువగానే వినిపించాయి. సెలబ్రెటీలు ఇక మీదట ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిదేమో..?