మెగా కాంపౌండ్‌కి అత్యంత సన్నిహితుడు వినాయక్. చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్.. వీళ్లందరితోనూ సినిమాలు చేశాడు. చిరంజీవికి అత్యంత ఆత్మీయుడు. అందుకే తన రీ ఎంట్రీ సినిమా బాధ్యతను వినాయక్ కి అప్పగించారు. వినాయక్ కూడా తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి చిరుకి అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు చిరుతో మరో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. మలయాళ చిత్రం `లూసీఫర్` రీమేక్ బాధ్యతలు వినాయక్‌కి అప్పగించిన సంగతి తెలిసిందే.
త్వరలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభం కావాలి. అయితే.. ఈ సినిమా నుంచి వినాయక్ తప్పుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చిరుతో సినిమా చేయాలన్నది ప్రతి దర్శకుడి కల. వినాయక్ కీ చిరుతో పనిచేయడం ఇష్టమే. కానీ.. ఈ సినిమా నుంచి కావాలనే వినాయక్ తప్పుకోవడం చర్చనీయాంశం అవుతోంది. లూసీఫర్ రీమేక్ కోసం వినాయక్ కొంత కాలం నుంచి వర్క్ చేస్తున్నాడు. ఫస్టాఫ్ పూర్తయిందట. అయితే.. సెకండాఫ్‌తో చిక్కులు మొదలయ్యాయని టాక్. తాను అనుకున్నట్టు ఈ స్క్రిప్టు రావడం లేదని, తానైతే ఈ కథకు న్యాయం చేయలేనని వినాయక్ అనుకున్నాడట.
ఇదే విషయం చిరుకి సున్నితంగా చెప్పాడట. చిరు కూడా... `కాన్ఫిడెన్స్ లేకపోతే ఈ సినిమా చేయొద్దు..` అని సలహా ఇవ్వడంతో.. వినాయక్ ఈ ప్రాజెక్టు లోంచి బయటకు వెళ్లిపోయాడని తెలుస్తోంది. అయితే... చిరుతో వినాయక్ మరో సినిమా తప్పకుండా చేస్తాడని, చిరు కోసం ఓ కొత్త కథ తయారు చేసుకుంటున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.