ప్రకృతి విపత్తుల వేళ సినీ పరిశ్రమ, బాధితులకు అండగా వుండేందుకు ఎప్పుడూ ముందుంటుంది. సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించడమే కాదు, బాధితులకు బాసటగా నిలిచే క్రమంలో.. స్వయంగా బాధితుల్ని పరామర్శిస్తుంటారు కూడా. అయితే భద్రతాపరమైన కారణాలు, వాటితోపాటుగా సెలబ్రిటీలు వెళ్ళినప్పుడు జరిగే తొక్కిసలాటలు, జనసమూహం ఎక్కువైపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకాలు.. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సెలబ్రిటీలు ఆయా ప్రాంతాలకు వెళ్ళేందుకు వెనుకాడుతుంటారు.
ఆ సంగతి పక్కన పెడితే, యంగ్ హీరో నిఖిల్.. సైలెంట్‌గా వెళ్ళి, తుపాను బాధితులతో మమేకమయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాని తిత్లీ తుపాను వణికించేయగా, లక్షలాదిమంది నీడను కోల్పోయారు. ఈ నేపథ్యంలో నిఖిల్, అక్కడికి వెళ్ళి.. బాధితులకు అండగా నిలిచాడు. బియ్యం, దుప్పట్లు అందించడమే కాదు, అక్కడే భోజన ఏర్పాట్లు కూడా చేశాడు. వారితో కలిసి భోజనం చేశాడు.
'మోస్ట్ శాటిస్‌ఫైయింగ్ డే.. మోస్ట్ శాటిస్‌ఫైయింగ్ డిన్నర్..' అంటూ ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు యంగ్ హీరో నిఖిల్. యువ హీరో రాకతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. పలువురు బాధితులు భావోద్వేగానికి గురయ్యారు. నిఖిల్ వారిని ఓదార్చాడు. తనవంతు బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు చెప్పాడు. తుపాను బాధిత ప్రాంతాల్లో నిఖిల్ పర్యటించి, తనవంతు సహాయం అందించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
మరోపక్క, తుపాను బాధితుల కోసం టాలీవుడ్ నుంచి విరాళాలు పోటెత్తుతున్నాయి. అందరికంటే ముందుగా విరాళం ప్రకటించిన సంపూర్ణేష్ అందరి మన్ననలూ అందుకుంటున్నాడు. ఇదిలా వుంటే, నిఖిల్ నటించిన 'ముద్ర' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.