బిగ్‌బాస్ రియాల్టీ షో సీజన్ 2 ముగిసి రోజులు గడుస్తున్నా, ఆ వివాదాలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. పలు ఇంటర్వ్యూల్లో బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 2 విన్నర్ కౌశల్ మండా చేస్తున్న వ్యాఖ్యలు, ఇతర కంటెస్టెంట్లు చేస్తున్న వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు వాతావరణం వేడెక్కుతూ వస్తోంది.
కొందరు కంటెస్టెంట్‌లు సీజన్ ముగిశాక సైలెంట్ అయిపోగా, ఇంకొందరు మాత్రం ఆ మూడ్‌లోంచి బయటకు రాలేకపోతున్నారట. ఈ కారణంగానే బిగ్ బాస్ వివాదాలు కొనసాగుతున్నాయనే అభిప్రాయాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. హౌస్‌లో ఏం జరిగినా, అది కేవలం గేమ్ షో మాత్రమే. బయటకు వచ్చాక ఎవరి లైఫ్ వారిది. కానీ, ఆ హౌస్‌లో సంఘటనల్ని మీడియా ప్రస్తావిస్తున్నప్పుడు, వాటిపై సమాధానం చెప్పక తప్పడంలేదు కంటెస్టెంట్స్‌కి.
కౌశల్‌ని ఎవరు ఏ ప్రశ్న వేసినా, ఆటోమేటిక్‌గా అట్నుంచి వచ్చే సమాధానం సంచలనమే అవుతోంది. వీలైనంతవరకు కౌశల్, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఇష్టపడటంలేదుగానీ, చెప్పే ఆ ఒక్క సమాధానం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుండడం గమనించాల్సిన అంశం. చాలా అడ్డంకుల్ని ఎదుర్కొని టైటిల్ గెలిచాడు గనుక, కౌశల్‌కి ప్రశ్నలు ఎక్కువే ఎదురవుతాయి. ఆ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పడం తప్పనిసరి.
అయితే కౌశల్ ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో కంటెస్టెంట్లయిన ఇతర సెలబ్రిటీలు ఇబ్బంది పడుతున్నారు. కౌశల్ ఆర్మీపై చట్టపరమైన చర్యలకు కంటెస్టెంట్లు సిద్ధమైతే, కౌశల్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.