సినిమా సినిమాకీ విలక్షణమైన కథలు ఎంచుకోవడమే కాదు, గెటప్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు యంగ్ హీరో నిఖిల్. నిఖిల్ పయనిస్తున్న దారి ఇప్పుడతనికి సక్సెస్‌ని ఇస్తోంది. ఇటీవలే రెండు సినిమాలతో సత్తా చాటాడు నిఖిల్. రెండూ డిఫరెంట్ జోనర్ సినిమాలే. ఇటీవలే 'కేశవ' సినిమా కోసం గెడ్డం పెంచి, న్యూ లుక్‌తో ఆకట్టుకున్న నిఖిల్ ఇప్పుడు తన కొత్త సినిమా కోసం కండలు పెంచేస్తున్నాడు. ఇప్పటికే 10 కిలోల బరువు కూడా పెరిగాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన సినిమాల విశేషాల్ని, తన ఫొటోల్ని అభిమానులకోసం పోస్ట్ చేస్తుంటాడు నిఖిల్. ఇంకో వైపున నిఖిల్ కొత్త సినిమా కోసం కాస్టింగ్ కాల్ షురూ చేశారు. 18 నుంచి 30 ఏళ్ళలోపు 8 మంది అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల్ని ఎంపిక చేస్తారు. నిఖిల్ హీరోగా చాలా మెచ్యూరిటీ కనబరుస్తున్నాడు. చూడ్డానికి లవర్ బోయ్‌లా కనిపించినా, కానీ నిఖిల్లో చాలా విషయం ఉందండీ బాబూ. అంతవరకూ సాఫ్ట్‌గా, చాక్లెట్ బోయ్‌లా కనిపించిన నిఖిల్‌కి 'కేశవ' సినిమా చాలా మార్పులు తెచ్చిపెట్టింది. కొత్త డైరెక్టర్స్‌తో కొత్త కొత్త కాన్సెప్ట్లున్న సినిమాలు చేస్తే వచ్చే మజానే వేరంటున్నాడు నిఖిల్. రొమాంటిక్ మూవీస్‌తో పాటు, విలక్షణ సబ్జెక్ట్ ఉన్న సినిమాల్లోనూ నటిస్తానంటున్నాడు. అలాగే నిఖిల్ కెరీర్ బెస్ట్ మూవీ అయిన 'కార్తికేయ' సీక్వెల్ చేయాలన్నది నిఖిల్ కోరికనీ చెప్పాడు. ఆ దిశగా నిఖిల్ ప్రయత్నాల్లో కూడా ఉన్నాడు.